OTT Market: ఓటీటీలో సినిమా ఎవడు చూస్తాడెహే.. థియేటర్‌లో చూస్తేనే ఆ కిక్కు ఉంటుందని రెండేళ్ళ క్రితం వరకూ అనుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఎప్పుడైతే కరోనా వచ్చిందో.. అప్పుడే థియేటర్లకి సినిమా కష్టాలు మొదలయ్యాయి. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతబడడంతో జనాలు ఓటీటీల వైపు మళ్ళారు. దీంతో ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లకి గిరాకీ పెరిగింది. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో నెగ్గుకు రావడం కష్టం అన్న పరిస్థితి నుండి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు లేకపోతే జనాలు ఉండలేరు అన్న పరిస్థితిని కల్పించే స్థాయికి వచ్చాయి. ఈ క్రమంలో కంపెనీల మధ్య పోటీ ఉన్నా కూడా ఇండివిడ్యువల్ కస్టమర్ సేటిస్ఫేక్షన్ రేసులో మాత్రం ఆయా కంపెనీలు ఎప్పుడూ టాప్‌లోనే ఉంటున్నాయి. ఇప్పుడు థియేటర్లు తెరిచినప్పటికీ కూడా వీటి హవా మాత్రం తగ్గలేదు. థియేటర్‌లో రిలీజయిన నెల, రెండు నెలలకే సినిమా ఓటీటీల్లో వచ్చేస్తుండడంతో సబ్‌స్క్రైబర్లు పెరుగుతున్నారే తప్ప తగ్గడం లేదు. అసలు ఇండియాలో ఈ ఓటీటీ మార్కెట్ క్లిక్ అవ్వాలంటే 5 ఏళ్ళు పడుతుందని అంచనా వేశారు. కానీ ఆ ఫీట్‌ను కరోనా పుణ్యమా అని రెండేళ్ళలో సాధించేసింది ఓటీటీ మార్కెట్. ఈ ఏడాది అత్యధికంగా 3 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఓటీటీ మార్కెట్.. ఇండియాలో రెండవ స్థానంలో ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2027 నాటికి 7 బిలియన్ డాలర్లకు ఈ మార్కెట్ లాభాల బాట పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో వున్న పలు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు ఏ ఏ స్థానాల్లో వున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు సబ్‌స్క్రైబర్లు ఏ స్థాయిలో కలిగి వున్నాయి అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నెట్‌ఫ్లిక్స్ ఇండియా, డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్, జీ5, వంటి ఓటీటీలు చాలానే ఉన్నాయి. వీటిలో డిస్నీ+హాట్‌స్టార్ అగ్ర స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 45 కోట్ల కంటే ఎక్కువ మంది ఉన్న ఓటీటీ యూజర్లలో.. డిస్నీ+హాట్‌స్టార్‌కి అత్యధికంగా 14 కోట్ల కంటే ఎక్కువ మంది యూజర్లు కలిగి ఉంది. దీంతో డిస్నీ+హాట్‌స్టార్ మొదటి స్థానంలో నిలిచింది. ఇక 6 కోట్ల మంది వినియోగదారులతో అమెజాన్ ప్రైమ్ రెండవ స్థానంలో నిలవగా, 4 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో నెట్‌ఫ్లిక్స్ మూడవ స్థానాన్ని దక్కించుకుంది. 3.7 కోట్ల కస్టమర్లతో జీ5 నాలుగు, 2.5 కోట్ల మందితో సోనీలివ్ ఐదో స్థానంలో నిలిచాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ.. డిస్నీ+హాట్‌స్టార్ 1.7 కోట్ల మంది వినియోగదారులతో ప్రథమ స్థానంలో నిలిచింది. అమెజాన్ 99 లక్షల మందితో రెండవ స్థానంలో, 48 లక్షలతో జీ5, 42 లక్షలతో ఆహా, 40 లక్షల మంది వినియోగదారులతో నెట్‌ఫ్లిక్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక డిస్నీ+హాట్‌స్టార్ ఇండియాలో అగ్ర స్థానంలో నిలవడానికి కారణం ఐపీఎల్ మ్యాచ్‌లే. ఈ ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార హక్కులని డిస్నీ+హాట్‌స్టార్ సొంతం చేసుకోవడం వల్ల ఇండియాలో నంబర్ వన్ పొజిషన్‌లో నిలిచింది. అయితే తాజాగా ఐపీఎల్ డిజిటల్ లైవ్ స్ట్రీమింగ్ హక్కుల్ని వయాకామ్ 18 స్టూడియోస్ డిజిటల్ సంస్థ 20,500 కోట్లకు సొంతం చేసుకుంది. దీని కారణంగా డిస్నీ+హాట్‌స్టార్ కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్‌ని కోల్పోనుందని.. కనీసం కోటిన్నర నుండి రెండు కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు డిస్నీ+హాట్‌స్టార్‌ని వీడటం ఖాయమని అంటున్నారు. మరి డిస్నీ+హాట్‌స్టార్ తన వినియోగదారులను కాపాడుకునేందుకు ఎలాంటి దారులు వెతుక్కుంటుందో, అగ్ర స్థానాన్ని ఏ విధంగా నిలబెట్టుకుంటుందో వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Moto X30 Pro: సినిమాలు షూట్ చేసేలా.. 200 మెగాపిక్సల్ కెమెరాతో స్మార్ట్ ఫోన్! ఇది కూడా చదవండి: Vijya Devarakonda: ఇండస్ట్రీలో నెపోటిజంపై స్పందించిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ!