దేశంలో 5జీ సేవలకు సంబంధించి మరో ముందడుగు పడింది. స్పెక్ట్రం వేలం ముగియడంతో దేశీయ టెలికాం కంపెనీలు 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే భారతీ ఎయిర్‌టెల్ 5జీ సేవలకు సంబంధించి ఎరిక్సన్, నోకియా, శాంసంగ్‌లతో ఒప్పందం కుదుర్చుకోగా, జియో సైతం.. కీలక అప్ డేట్ ఇచ్చింది. 5G రోల్‌అవుట్‌తో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' జరుపుకుంటామంటూ ప్రకటించింది. దీంతో ఆగస్టు 15 నుంచే జియో 5G సేవలు మొదలుకానున్నట్లు తెలుస్తోంది. 5జీ స్పెక్ట్రం వేలంలో.. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో టాప్ బిడ్డర్‌గా నిలిచైనా సంగతి తెలిసిందే. పలు బ్యాండ్లకు చెందిన 24,740 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను రూ.88,078 కోట్లకు దక్కించుకుంది. వేలంలో అమ్ముడైన మొత్తం స్పెక్ట్రమ్‌లో దాదాపు సగం అంబానీయే కొనుగోలు చేయటం విశేషం. వేలంలో 700, 800, 1,800, 3,300 మెగాహెట్జ్‌తోపాటు 26 గిగాహెట్జ్ బ్యాండ్‌విడ్త్ స్పెక్ట్రంను దక్కించుకున్నట్లు రిలయన్స్ జియో తెలిపింది. ముఖ్యంగా దేశంలోని 22 సర్కిళ్లలో 700 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ కొనుగోలు కంపెనీకి 5జీ సేవల్లోనూ ఆధిపత్యానికి దోహదపడనుంది. ఎందుకంటే, 700 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌తో 6-10 కిలోమీటర్ల వరకు సిగ్నల్ అందించవచ్చు. మిగతా బ్యాండ్‌విడ్త్‌లతో పోలిస్తే, ఒక్కో టవర్‌తో అధిక ప్రాంతానికి కనెక్టివిటీ కల్పించేందుకు వీలుపడుతుంది. ఎయిర్‌టెల్ రిలయన్స్ జియోతో పాటు భారతీ ఎయిర్‌టెల్ కూడా 5G సర్వీసెస్ ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల చివరిలో 5జీ సేవలను ఎయిర్ టెల్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఎరిక్సన్, నోకియా, శాంసంగ్‌లతో ఎయిర్‌టెల్ ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎయిర్‌టెల్ 19867 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. ఇదీ చదవండి: ఈ 13 నగరాల్లోనే ముందుగా 5G సేవలు.. ఇందులో మీ నగరం ఉందో లేదో చెక్ చేసుకోండి! ఇదీ చదవండి: 5G Network: 5జీ టెక్నాలజీ అంటే లాభాలే కాదు! ఈ నష్టాలు కూడా ఉంటాయి!