కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5జీ స్పెక్ట్రం వేలం.. తీవ్ర నిరాశను మిగిల్చింది. గత రెండేళ్లతో పోల్చితే మెరుగైన ఫలితాలు కనిపించినప్పటికీ.. 70 శాతం స్పెక్ట్రమ్ మాత్రమే అమ్ముడైంది. రూ.4.3 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రంను అమ్మకానికి పెడితే.. రూ.1.5 లక్షల కోట్లకే బిడ్లు పరిమితమయ్యాయి. కాగా, నిరుడు 4జీ స్పెక్ట్రం వేలంలో రూ.77,815 కోట్ల బిడ్డింగ్ జరగగా, 2010లో చేపట్టిన 3జీ స్పెక్ట్రం వేలంలో రూ.50,968.37 కోట్ల బిడ్లు వచ్చాయి. ఈ రకంగా చూస్తే మాత్రం ఖజానాకు కాసులు పెరిగినట్టే అనుకోవచ్చు. గత నెల 26న మొదలైన స్పెక్ట్రం వేలం.. 7 రోజుల పాటు కొనసాగింది. తొలిరోజు రికార్డు స్థాయిలో ఆదరణ కనిపించినప్పటికీ.. మిగతా ఆరు రోజుల్లో రోజురోజుకూ బిడ్డింగ్ విలువ తగ్గుతూపోయింది. ఈసారి వేలంలో నాలుగు సంస్థలు పాల్గొన్నాయి. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోనే టాప్ బిడ్డర్‌గా నిలవగా, భారతి ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా, అదానీ గ్రూప్ తరువాతి స్థానాల్లో నిలిచాయి. బిడ్డింగ్ సరళినిబట్టి దేశవ్యాప్తంగా జియో, ఎయిర్‌టెల్ 5జీ సేవలను అందించే వీలుండగా, వొడాఫోన్ ఐడియా మాత్రం ఎంపిక చేసుకున్న నగరాలకే పరిమితం కావచ్చనిపిస్తోంది. ఆగస్టు10 కల్లా 5జీ స్పెక్ట్రం సంస్థలకు కేటాయించనున్నారు. దేశంలో 5జీ సేవలు అక్టోబరు నుంచి ప్రారంభం కానున్నాయి. టాప్ బిడ్డర్‌గా రిలయన్స్ జియో 5జీ స్పెక్ట్రం వేలంలో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోనే టాప్ బిడ్డర్‌గా నిలిచింది. జియో బిడ్ల విలువ అత్యధికంగా రూ.88,078 కోట్లుగా ఉన్నది. ఇది ఈసారి అమ్ముడైన మొత్తం స్పెక్ట్రం విలువలో సగానికిపైగా ఉండటం విశేషం. మొత్తం 5 బ్యాండ్లలో జియో బిడ్డింగ్ వేయగా, ప్రస్తుత 4జీ కంటే సుమారు 10రెట్లు అధికంగా దీని వేగం ఉండనున్నది. దేశంలోని 22 సర్కిళ్లలోనూ 5జీ స్పెక్ట్రమ్ కోసం రూ.88,078 కోట్ల విలువైన బిడ్లు వేసింది. 6-10 కి.మీ. పరిధిలో సిగ్నల్ అందించగల 700 మెగాహెర్జ్ తో పాటు, 800, 1800, 3300 మెగాహెర్జ్, 26 గిగాహెర్జ్ బ్యాండ్లలో కలిపి 24.740 మెగాహెర్జ్ స్పెక్ట్రం కొనుగోలు చేసింది. ఇందుకోసం ఏడాదికి రూ.7.877 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎయిర్‌టెల్: 700 మెగాహెర్జ్ మినహా, వివిధ బ్యాండ్ లో 19,867 మెగాహెర్జ్ స్పెక్ట్రంను రూ.43,084 కోట్లతో కొనుగోలు చేసింది. వొడాఫోన్ ఐడియా: రూ.18.799 కోట్ల విలువైన 6228 మెగాహెర్జ్ స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. 5జీ సేవలతో పాటు దేశం అంతటా 4జీ సేవలు అందించగలమని పేర్కొంది. ఆదానీ: 238 గిగాహెర్జ్ బ్యాండ్లలో 400 మెగాహెర్జ్ స్పెక్ట్రంను రూ.212 కోట్లకు కొనుగోలు చేసింది. ముంబయితో పాటు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల్లో తమ ప్రైవేటు నెట్వర్క్ కోసం ఈ సెక్షము అదానీ గ్రూప్ వినియోగించుకోనుంది. 5జీ స్పెక్ట్రం వేలం హైలైట్స్: 10 బ్యాండ్లలో మొత్తం 72,098 మెగాహెర్జ్ స్పెక్ట్రంను అమ్మకానికి.. విలువ రూ.4.3 లక్షల కోట్లపైనే అమ్ముడైన 51,236 మెగాహెట్జ్‌ల స్పెక్ట్రం (71 శాతానికి సమానం).. విలువ రూ.1.5 లక్షల కోట్లు 700 మెగాహెట్జ్‌కు ఎక్కువ డిమాండ్ 600, 2300, 2500 మెగాహెట్జ్ బ్యాండ్లకు దక్కని బిడ్లు టాప్ బిడ్డర్‌గా రిలయన్స్ జియో (రూ.88,078 కోట్లు) భారతీ ఎయిర్‌టెల్ (రూ.43,084 కోట్లు) వొడా ఐడియా (రూ.18,784 కోట్లు) అదానీ చేతికి (రూ.212 కోట్లు) ఈ నెల 10 కల్లా సంస్థలకు స్పెక్ట్రం కేటాయింపులు. అక్టోబర్ నుంచి 5జీ సేవలకు అవకాశం. Telecom industry responds to PM @narendramodi Ji’s telecom reforms: 5G spectrum auction grosses Rs. 1,50,173 Crore. pic.twitter.com/3lLMKbPzub — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 1, 2022 ఇదీ చదవండి: Roshni Nadar: ఇండియాలోనే అత్యంత సంపన్న మహిళ రోష్ని నాడార్.. ఆమె సంపద ఎంతంటే! ఇదీ చదవండి: భారత్ లో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈఓ.. ఏడాదికి రూ.123 కోట్లా?