ఇటీవల విశాఖలో పలు కంపెణీల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. విషవాయువులు లీక్ కావడంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. తాజాగా అచ్యుతాపురం సెజ్‌లో మరోసారి విష వాయువు లీక్ కావడంతో పలువురు మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ అచ్యుతాపురం, అనకాపల్లిలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. విశాఖ అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీకైంది. ఈ విషవాయువు పీల్చుకొని 150 మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. విష వాయువును పీల్చుకొని యాభై మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురి అయి.. వాంతులు, వికారంతో కుప్పకూలిపోయారు. పరిస్థితి గమనించిన యాజమాన్యం బాధితులను వెంటగనే అచ్యుతాపురం, అనకాపల్లిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి వద్ద ఎక్కడ చూసినా ఆహాకారాలు.. హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. గతంలో జరిగిన ప్రమాదంపై అనకాపల్లి జేసీ కల్పనాకుమారి ఆధ్వర్యంలో నియమించిన నిపుణుల కమిటీ విచారించినా.. ఇంతవరకూ ప్రమాదానికి కారణాలు, విషవాయువు ఎక్కడ నుంచి విడుదలైందో ఇంకా చెప్పలేదని వాపోయారు. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై ఎపిపిసిబి అధికారులు వచ్చి పరిస్థితిని అంచనా వేయాలని పోలీసులు ఎదురుచూస్తున్నారు. అక్కడికి ఎవరినీ అనుమతించడం లేదు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అధికారులతో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇది చదవండి: యూట్యూబ్ చూసి సొంతంగా ముక్కు ఆపరేషన్ చేసుకున్నాడు.. చివరకు!