పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి కష్టాలను తెలుసుకున్నారు. సమస్యలు విన్నారు.. తాను అధికారంలోకి వస్తే.. పరిష్కారం చూపుతానని మాట ఇచ్చారు. ఆ ప్రకారమే ఎన్నికల ప్రచారం సందర్భంగా తమకు అవకాశం ఇస్తే.. తాను తీసుకువచ్చే సంక్షేమ పథకాలను నవ రత్నాలుగా ప్రకటించారు. మిగతా సీఎంల మాదిరి కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు సీఎం జగన్. అంతేకాక హామీల్లో ప్రకటించని అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. అలా రూపకల్పన చేసిన పథకమే వైఎస్సార్ నేతన్న నేస్తం. అప్పుల భారం, ఆర్థిక సమస్యలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న నేతన్నలను ఆదుకోవడానికి.. వారికి ఆర్థిక స్వావలంభన కలిగించడం కోసం తీసుకువచ్చిన పథకమే నేతన్న నేస్తం. ఇప్పటికి వరుసగా మూడు ఏళ్లుగా ఈ పథకం ద్వారా నేతన్నలకు ఆర్థిక సాయం అందించగా.. గురువారం నాలుగో విడత నేతన్న నేస్తం కింద అందించే ఆర్థిక సాయాన్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు సీఎం జగన్. ఈ పథకం పూర్తి వివరాలు.. నేతన్ననేస్తం.. ఈ పథకం కింద.. అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.24,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఇప్పటికి వరుసగా మూడేళ్లు.. ప్రతి ఏడాది 24 వేల రూపాయల చొప్పున సాయం అందించగా.. గురువారం నాడు నాల్గో విడత నిధులను విడుదల చేశారు. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 80,546 మంది నేతన్నల ఖాతాలో రూ.193.31 కోట్లను జమ చేశారు. ఇక ఈ నాలుగేళ్లకి కలిపి అర్హుడైన ప్రతి నేతన్నకు ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.96,000. ఇప్పటివరకూ ఈ పథకం ద్వారా నేతన్నలకు అందించిన మొత్తం సాయం రూ.776.13 కోట్లు. ప్రభుత్వం నేతన్న నేస్తం కింద అందిస్తున్న ఆర్థిక సాయంతో.. నేతన్నలు డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ వంటి అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేసి.. మగ్గాలను ఆధునీకరించుకుని.. ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. నాణ్యమైన బట్టలు నేస్తూ.. కొత్త కొత్త డిజైన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ఫలితంగా 2018-19 వరకు కేవలం నెలకు 4,680 రూపాయల ఆదాయాన్ని మాత్రమే పొందగా.. ఇప్పుడు అది మూడు రెట్లు పెరిగి 15 వేలకు చేరుకుంది. నేతన్న నేస్తం ద్వారా సీఎం జగన్ తమను ఆదుకోవడం వల్లే ఇది సాధ్యమయ్యింది అని నేతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడేళ్లకు గాను నేతన్నల సంక్షేమం కోసం సీఎం జగన్ ఆప్కోకు 393.30 కోట్ల రూపాయలు చెల్లించారు. దీనిలో చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా ఉన్న 103 కోట్ల రూపాయల బకాయిలను కూడా సీఎం జగన్ చెల్లించారు. ఇక ఇప్పటి వరకు ప్రభుత్వం... వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ.776.13 కోట్లు, నేతన్నల పెన్షన్ కోసం రూ.879.8 కోట్లు, ఆప్కోకు చెల్లించిన రూ.393.3 కోట్లతో కలిపి మూడేళ్లలో నేతన్నల సంక్షేమం కోసం మొత్తం రూ.2,049.2 కోట్లు వెచ్చించింది. నేతన్న ఉత్పత్తులకు ప్రచారం కోసం ఎంఎన్‌సీ కంపెనీలతో ఒప్పందం.. ఇక ఆప్కో ఉత్పత్తులు, వస్త్రాలకు మంచి మార్కెటింగ్ సదుపాయం కల్పించి.. నేతన్నల ఆదాయం పెంచడం కోస ప్రభుత్వం అనేక అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు గాను ప్రభుత్వం ఈ–కామర్స్ సంస్థలైన అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, గోకూప్, లూమ్‌ఫోక్స్, లాంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. సీఎం జగన్ తీసుకున్న చర్యల కారణంగా తమ జీవితాలు మెరుగుపడుతున్నాయంటూ నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే.. APలో జగన్‌కి జైకొట్టిన జనాలు! ఇది కూడా చదవండి: చిన్న గ్రానైట్ పరిశ్రమల కరెంట్ ఛార్జీల్లో రూ.2 తగ్గింపు: సీఎం జగన్