ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. అయితే ఆ టాలెంట్ బయటపడేందుకు ఓ సందర్భం అంటూ రావలి. అలాంటి సమయం వచ్చినప్పుడు.. తమ టాలెంట్ తో ఒక్కసారిగా వెలుగులోకి వస్తారు. అలానే ఓ యువకుడు.. తన టాలెంట్ తో మంచి గుర్తింపు పొందాడు. జాబ్ చేస్తున్న తన అక్క.. ప్రయాణం విషయంలో రోజూ పడుతున్న ఇబ్బంది.. ఆ యువకుడి మనస్సు కలచి వేసింది. దీంతో ఎలాగైన ఈ సమస్య నుంచి అక్కకు పరిష్కారం కనుక్కోవాలని భావించాడు. అంతే రేయింబవళ్లు శ్రమించి సొంతంగా ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తయారు చేసి.. అక్కకు బహుమతిగా ఇచ్చాడు. దీంతో ఆ అక్క ఆనందాన్నికి అవధుల్లేవు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా రాజవొమ్మంగికి చెందిన సామన సురేష్ స్థానికంగా ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి చిన్నతనం నుంచి ఎలక్ట్రిక్ వస్తువులపై అమితాసక్తి ఉంటుంది. అలా పెద్ద అయిన తరువాత ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేసేవాడు. ఈ క్రమంలో మోటార్లకు సంబంధించిన అనేక విషయాలను బాగా ఆకళింపు చేసుకున్నాడు. సురేష్ కి వెంకటలక్ష్మి అనే అక్క ఉంది. ఆమె బ్రాంచ్ పోస్ట్ మాస్టార్ విధులు నిర్వహిస్తోంది. అయితే ఆమె పనిచేసే గ్రామం రాజవొమ్మంగికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి ఆమె రోజూ స్కూటర్‌పై విధులకు వెళ్తుంటుంది. అయితే ఈ క్రమంలో బైక్ పెట్రోల్ కోసం భర్తను డబ్బులు అడగుతుండేది. ఇలా వెంటకలక్ష్మి, తన భర్తను డబ్బులు అడటం సురేష్ విన్నాడు. దీంతో పెట్రోల్ బైక్ వలన అక్కకు నెలకు రూ.2,880 ఖర్చవుతోందని తెలుసుకున్నాడు. ఆమెకు వచ్చేదే తక్కువ జీతం.. అందులో సగం పెట్రోల్ ఖర్చలకే పోతున్నాయి. దీంతో సురేష్ ఆలోచనలో పడ్డాడు. అయితే అప్పటికే అక్క కోసం బ్యాటరీతో నడిచే ఓ సైకిల్ ను సురేష్ తయారు చేసి..అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే అక్కను సైకిల్ పై పోస్టాఫీసుకు పంపడం ఇష్టం లేదు. దీంతో ఆమె కోసం బ్యాటరీలతో నడిచే స్కూటర్ ను తయారు చేయాలని భావించాడు. మెదడుకు పదును పెట్టి కొన్ని రోజుల పాటు కష్టపడ్డాడు. చివరకి అనుకున్నది సాధించాడు. బైక్ ను పెట్రోల్, బ్యాటరీ..రెండిటీతోనూ నడిచేలా తయారు చేశాడు. తమ్ముడు తెలివికి అక్క వెంకటలక్ష్మి మురిసిపోయారు. రయ్.. రయ్‌మంటూ రోడ్లపై పరుగులు తీస్తున్న స్కూటర్‌తో మరింత అనుబంధం పెంచుకున్నారు. సెల్‌ఫోన్‌కు మాదిరిగానే బ్యాటరీ ఛార్జింగ్ పెడితే సరిపోతుండటంతో వెంకటలక్ష్మి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇప్పుడిక బండిలో పెట్రోలు ఉందా లేదా చూడనవసరం లేకుండా రయ్ రయ్ మంటూ ఆఫీసుకు వెళ్తున్నారు.ఈ బైక్ ను తయారు చేసేందుకు తనకు రూ. 28,000 ఖర్చయిందని సురేష్ తెలిపాడు. మూడు 12 ఓల్ట్స్ బ్యాటరీలతో తయారు చేసిన ఈ బైక్ కు మూడు గంటల పాటు ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. చూడటానికి పెట్రోల్ స్కూటర్ మాదిరిగా ఉన్న ఈ బ్యాటరీ స్కూటర్‌ను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. మరి.. అక్క కోసం తమ్ముడు చేసిన ఈ అద్భుతంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: స్టేజ్ పై నుండే అవ్వ కష్టాన్ని గమనించిన సీఎం జగన్! స్పాట్ లో న్యాయం! ఇదీ చదవండి: నేతన్నలకు అండగా సీఎం జగన్! నేతన్న ఖాతాలో 24 వేలు జమ!