ఏ లోన్ తీసుకున్నా గానీ ప్రతి నెలా వడ్డీ అనేది కట్టాల్సి ఉంటుంది. అలానే అప్పు తీర్చాల్సి ఉంటుంది.

కానీ ఈ లోన్ తీసుకుంటే బతికినన్ని రోజులూ ఒక్క రూపాయి కూడా వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. అలానే అప్పు తీర్చాలన్న బెంగ కూడా అవసరం లేదు.  

రిటైర్మెంట్ సమయంలో పిల్లలు చూస్తారో లేదో అన్న బెంగ చాలా మంది తల్లిదండ్రులకు ఉంటుంది.

అందుకోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, బీమా పాలసీలు వంటి వాటిలో పెట్టుబడి పెడతారు. అయితే వడ్డీ రేట్లు ఎలా ఉంటాయో అన్న భయం ఉంటుంది.

దీనికి తోడు పెద్దగా ఆస్తులు పోగుజేయలేకపోవడం, పెన్షన్ పెద్దగా రాకపోవడం అనేవి వృద్ధాప్యంలో ఇబ్బందులు పెడతాయి.

ఎందుకంటే ఆ వయసులో అనారోగ్య సమస్యలు వస్తే మెడికల్ ఖర్చులకు కూడా పెన్షన్ డబ్బులు సరిపోవు.

ఇటువంటి పరిస్థితుల్లో వృద్ధులకు ఆసరాగా నిలిచేది ఒక్క రివర్స్ మోర్టగేజ్ లోన్ మాత్రమే.

మీకు గనుక సొంత ఇల్లు ఉంటే దాని మీద లోన్ ఇస్తారు. ఇంటి విలువ మీద 80 శాతం లోన్ అయితే ఇస్తారు.

ఈ లోన్ మొత్తం ఒకేసారి కాకుండా నెలకు వాయిదాల రూపంలో అవసరాన్ని బట్టి బ్యాంకులు చెల్లిస్తాయి.

అయితే వడ్డీ అనేది లోన్ అమౌంట్ ఎంత తీసుకుంటే అంతకు పడదు. నెల నెలా బ్యాంకులు చెల్లించే వాయిదాకి మాత్రమే వడ్డీ పడుతుంది.

అయితే వాయిదాల రూపంలో బ్యాంకులు ఇచ్చే సొమ్మును వృద్ధులు ఖర్చు పెట్టుకోవచ్చు. తమ అవసరాలకు వాడుకోవచ్చు. ఎలాంటి వడ్డీ చెల్లించే పని లేదు.

బతికినంత కాలం వడ్డీ కట్టాలన్న బెంగ ఉండదు, అప్పు తీర్చాలన్న భయం ఉండదు. దర్జాగా మహరాజులా, మహారాణిలా బతకొచ్చు.

మరి బ్యాంకుకి ఇంటి మీద హక్కు ఉండదా అంటే మీరు కాలం చెందనంత వరకూ మీ జోలికి రాదు.

వృద్ధ దంపతులు ఇద్దరూ కలిపి లోన్ తీసుకుంటే గనుక ఇద్దరూ కాలం చెందిన తర్వాతే ఇంటి మీద బ్యాంకుకు హక్కులు ఉంటాయి.

15 నుంచి 20 ఏళ్ల వరకూ లోన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత కూడా అదే ఇంట్లో ఉండవచ్చు.

చనిపోయిన తరువాత ఎంత వడ్డీ అయ్యిందో లెక్కించి, అసలు లోన్ మొత్తానికి జత చేసి వారసులు ఉంటే వారికి నోటీసులు పంపుతుంది.

వారు బాధ్యతగా ముందుకొచ్చి అప్పు తీరిస్తే ఇల్లు వారి సొంతమవుతుంది. లేదంటే వేలం వేసి వచ్చిన డబ్బును అప్పుగా కొట్టివేస్తుంది.

అయితే మొత్తం లోన్ కి అయిన డబ్బు కంటే వేలంలో ఎక్కువ డబ్బు వస్తే మిగిలిన ఆ సొమ్మును వారసులకు ఇవ్వడం జరుగుతుంది.

ఈ లోన్ సదుపాయం కేవలం రిటైర్ అయిన వృద్ధులకు మాత్రమే.