వేసవి కాలం ప్రారంభం అయ్యింది. ఎండలు విపరీతంగా ఉన్నాయి.

ఉదయం ఎనిమిది గంటల తర్వాత అడుగు బయటపెడదాం అంటే భయమేస్తుంది.

అంతలా ఎండలు మండి పోతున్నాయి. ఇక వేసవిలో ఎండ తీవ్రత నుంచి ముఖాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం.

ఎండ వల్ల ముఖం వెంటనే నల్లగా అవుతుంటుంది. అలా కాకుండా ఉండాలంటే.. సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడాలి.

ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నామంటే.. సన్‌స్క్రీన్‌ లోషన్‌ అప్లై చేసుకోవాలి.

అయితే చాలా మంది సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకుంటే.. ముఖం జిడ్డుగా మారి.. చిరాగ్గా ఉంటుందని వాడరు.

కానీ తప్పనిసరిగా వేసవిలో సన్‌స్క్రీన్‌ లోషన్‌ వినియోగించాలి.

సూర్యరశ్మిలో ఉండే యూవీఏ, యూవీబీ కిరణాలు చర్మాన్ని నేరుగా తాకడం వల్ల అనేక నష్టాలు ఉన్నాయి.

ఈ కిరణాలు నేరుగా చర్మాన్ని తాకడం వల్ల చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు వస్తాయి.

చర్మంపై నల్ల మచ్చలు, ముడతలు వస్తాయి. కొన్ని సార్లు వీటి వల్ల చర్మ కాన్యర్‌ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

ఇలాంటి సమస్యలను నివారించాలంటే.. తప్పకుండా సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాలి.

మరి ఎలాంటి సన్‌స్క్రీన్‌ లోషన్‌ ఎంచుకోవాలి అంటే..

టైటానియం డై ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్, ఆక్సీబెంజాన్, ఏవో బెంజాన్, మెక్సోరిల్ 5X ఉండే సన్‌స్క్రీన్ లోషన్లు మాత్రమే వాడాలి.

ఇవి సూర్యరశ్మి నుంచి మీ చర్మానికి రక్షణ కవచంలా కాపాడతాయి.

అలాగే సన్‌స్క్రీన్‌ లోషన్‌ ఎంచుకునే ముందే ఎస్‌పీఎఫ్‌ శాతాన్ని కూడా చెక్‌ చేసుకోవాలి.

SPF అంటే.. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్‌. మీరు వాడే సన్‌స్క్రీన్ లోషన్లలో ఇది కనీసం 15 శాతమైనా ఉండాలి.

అంతకంటే తక్కువ ఎస్‌పీఎఫ్‌ ఉన్న సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడినా ఎలాంటి ఫలితం ఉండదు.

ఎస్‌పీఎఫ్‌ 30 శాతం ఉండే ప్రొడక్టులైతే మరీ మంచిది.

ఇవి సుమారు 90 నుంచి 98 శాతం చర్మానికి రక్షణ కల్పిస్తాయి.

సన్‌స్క్రీన్‌ లోషన్‌ను ఏ సమయంలో రాసుకోవాలి అంటే..

ఇంట్లోనే ఉంటే స్నానం చేసిన తర్వాత ఒకసారి రాసుకుంటే సరిపోతుంది.

ఒకవేళ బయటకు వెళ్తున్నట్లయితే.. వెళ్లడానికి కనీసం 15 నుంచి 20 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవాలి.

బయట ఎక్కువ సేపు గడిపితే ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం ఉత్తమం.

దీనివల్ల చర్మానికి ఎక్కువ సేపు రక్షణ లభిస్తుంది.

సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం వల్ల జిడ్డుగా ఉంటుంది అనుకునే వారు.. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు వాటర్‌ బేస్డ్‌ లోషన్లు సెలక్ట్‌ చేసుకోవచ్చు.

ఇక సన్‌స్క్రీన్‌ లోషన్‌ని ముంజేతులు, మెడ, ఛాతీ దగ్గర కూడా రాసుకోవాలి.

అలానే పొడి చర్మం కలిగినవారు ముందుగా ముఖానికి మాయిశ్చరైజర్‌ అప్లై చేసి, ఆ తర్వాత సన్‌స్క్రీన్‌ లోషన్‌ వాడాలి.

ప్రస్తుతం మార్కెట్‌లో మాయిశ్చరైజర్ కలిగిన సన్‌స్క్రీన్ లోషన్లు కూడా లభిస్తున్నాయి.

అయితే అలర్జీలు, సున్నితమైన చర్మం ఉన్నవారు ఆల్కహాల్ కలిగిన లోషన్లు వాడకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

అలాగే చిన్నారులకు డై ఆక్సీబెంజాన్ ఉండే సన్‌స్క్రీన్ లోషన్లు వాడకూడదు అంటున్నారు.

సున్నిత చర్మం కలిగిన వాళ్లు చర్మ వైద్యుల సూచన మేరకు 50 ప్లస్‌ ఎస్‌పీఎఫ్‌ ఉన్న లోషన్స్‌ వాడాలి.

అలానే జిడ్డు చర్మం ఉన్నవాళ్లు మాయిశ్చరైజర్ లేని లోషన్లు ఎంచుకోవాలి.

పొడిచర్మం ఉన్నవారు మాత్రం మాయిశ్చరైజర్ కలిగిన సన్‌స్క్రీన్ లోషన్లు వాడొచ్చు.