సమస్త జీవ కోటి మనుగుడకు నీరే ఆధారం. జలం పుట్టిన తరవాతే జీవకోటి ఉద్భవించింది.
అలాంటి జలాన్ని దేవతగా చూస్తూ ఆరాధించడం హిందూ సంప్రదాయంగా మారిపోయింది.
తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారం బ్రహ్మ నుండి ఆకాశం, ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి జలం, జలం నుండి భూమి, భూమి నుండి ఔషధులు, ఔషధుల నుండి అన్నం , అన్నం నుండి జీవుడు పుట్టాయని వివరిస్తుంది.
ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం దేవతా మూర్తిగా మారింది.
ఇందులో స్నానం చేస్తే సకల పాపాలతో పాటు రోగాలు అంతమౌతాయని విశ్వసిస్తారు. అలా స్నానం ప్రాముఖ్యతను గుర్తు చేసేవే పుష్కరాలు.
పుష్కరాల సమయంలో నదీ స్నానాలు ఆచరించించి శ్రద్ధ కర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు చేస్తే పితరుల ఆత్మ శాంతిస్తుందని ఉవాచ
భారతదేశంలో గంగా, యమున, నర్మద, కావేరి, భీమరథి, సరస్వతి, గోదావరి, కృష్ణ, తపతి, తుంగభద్ర, సింధు, ప్రాణహిత వంటి 12 జీవనదులు ప్రవహిస్తున్నాయి.
వీటినే పుష్కర నదులు అంటారు. ఈ 12 పుష్కర నదులకు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తుంటాయి.
ఈ పుష్కరాలు ఆయా రాశులకు అనుగుణంగా వస్తుంటాయి. ఒక్కోనదికి ఒక్కో రాశి అధిష్టానమై ఉంటుంది.
ఈ పుష్కరాలు కూడా 12 రోజుల పాటు జరుగుతుంటాయి. పుష్కర సమయంలో నదిలో సకల దేవతలు కొలువై వుంటారు.
అందుకే పుష్కరాల సమయంలో నదీ స్నానం చేస్తే పాపాలు అన్ని తొలగి పుణ్యం వస్తుందని భారతీయ ప్రజల నమ్మకం.
12 సంవత్సరాలు 12 రాశుల ప్రకారం పుష్కరాలు జరుగుతుంటాయి.
బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుష్కరాలు వస్తాయి.
ఏ రాశిలో గురుగ్రహం ప్రవేశిస్తే ఏ నదికి పుష్కరాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి -గంగానది, వృషభరాశి -నర్మదానది, మిథునరాశి -సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి.
కర్కాటక రాశి -యమునా నది, సింహరాశి -గోదావరి నది, కన్యారాశి -కృష్ణానదికి పుష్కరాలు చేస్తారు
తులారాశి -కావేరి నది, వృశ్చిక రాశి - భీమరథీ నది, ధనూరాశి -పుష్కరవాహిని (తపతి) నదికి పుష్కరాలు నిర్వహిస్తారు.
మకర రాశి - తుంగభద్ర నది, కుంభరాశి -సింధూనది, మీనరాశి - ప్రాణహితనదికి పుష్కరాలు వస్తాయి.