ఇప్పుడంటే ఒకరిద్దరు పిల్లల్నే కంటున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం అరడజను వరకు పిల్లల్ని కనేవారు.
మన అమ్మమ్మలు, నాన్నమ్మలు కాలంలో అయితే డజను మంది పిల్లల్ని కూడా కనేవారు.
దేశంలో జనాభా పెరిగిపోతుండటంతో నియంత్రణ కోసం ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో ఈ పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వచ్చింది.
ఇప్పుడు చాలా మటుకు ఒకరు లేదా ఇద్దరు పిల్లల్నే కంటున్నారు. మగపిల్లాడి కోసం కొందరు మూడో కాన్పు, నాలుగో కాన్పు చూసేవారు కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఆఫ్రికాలో ఓ మహిళ మాత్రం ఏకంగా 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది.
ఆ మహిళ పేరు మరియం నబంతాజీ. ఉగాండా దేశానికి చెందిన 40 ఏళ్ల మరియం ఏకంగా 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది.
మరియమ్‌కు 12 ఏళ్ల వయసులోనే పెళ్లైంది. వివాహమైన మరుసటి ఏడాది ఆమె తొలిసారి కవలలకు జన్మనిచ్చింది.
36 ఏళ్ల వయసు వచ్చేసరికి మరియమ్.. 42 మంది పిల్లలకు తల్లైంది. ఆ తర్వాత మరో ఇద్దరు పిల్లల్ని కన్న ఆమెకు ఇప్పుడు 40 ఏళ్లు.
ఇంతమంది పిల్లలకు జన్మను ఇచ్చిన మరియమ్‌ను స్థానికులు మామా అని పిలుస్తుంటారు.
ఆమెకు పుట్టిన 44 మంది సంతానంలో ఇప్పుడు 38 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు. మిగిలిన ఆరుగురు చిన్నారులు చనిపోయారు.
అధిక సంతానం కావడం, పేదరికాన్ని భరించలేక మరియమ్ భర్త కుటుంబాన్ని పోషించలేక పారిపోయాడు.
భర్త లేకపోయినా పిల్లల పెంపకాన్ని ఎప్పుడూ భారంగా ఫీలవ్వలేదు మరియమ్. వారికి అన్నీ తానై ప్రేమగా సాదుతోంది.
పిల్లల్ని పోషించడం కోసం హెయిర్ స్టైలిస్ట్‌గా, ఈవెంట్ డెకరేటర్‌గా పనిచేస్తోంది మరియమ్. డబ్బులు సరిపోకపోవడంతో వనమూలికలతో ఔషధాలను తయారు చేసి అమ్ముతోంది.
ఎన్జీవోల నుంచి వచ్చే విరాళాలతో తన బిడ్డలను మరియమ్ చదివిస్తోంది.