బ్లూ టిక్ కావాలా, అయితే డబ్బులు కట్టాల్సిందే. బ్లూ టిక్ ఏంటి? అని అడిగారనుకోండి, ఊరికే ఇచ్చేస్తారేంటి టిక్కు, నెల నెలా అమౌంట్ పే చేయాలి.
అయితే ఈ డిజిటల్ సొసైటీలో సెలబ్రిటీల నుంచి సామాన్యులని వేరు చేసేదే బ్లూ టిక్. బ్లూ టిక్ అనేది లేకపోతే ఎవరు డూపో, ఎవరు ఒరిజినల్లో అనేది తెలియదు.
సెలబ్రిటీల ఖాతాల మీద కొన్ని వందల, వేల నకిలీ ఖాతాలు ఉన్నాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ వచ్చిన మొదట్లో అయితే బ్లూ టిక్ అనేది లేనే లేదు.
దీంతో సెలబ్రిటీల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి పెంట పెంట చేశారు చాలా మంది. ఇలాంటి దరిద్రాలు ఉండకూడదనే బ్లూ టిక్ ఆప్షన్ ని తీసుకొచ్చారు.
మొదట ఈ బ్లూ టిక్ ఆప్షన్ ని ట్విట్టర్ 2009లో తీసుకొచ్చింది. అసలు మొదట్లో ట్విట్టర్ ను ఎక్కువగా వాడిందే సెలబ్రిటీలు. వారి కోసమే అన్నట్టు ఉండేది. రాను రాను ట్విట్టర్ యూజర్స్ పెరిగిపోవడంతో అసలెవరో, నకిలీ ఎవరో తెలిసేది కాదు.
అందుకే జెన్యూన్ అకౌంట్లను వెరిఫై చేసి బ్లూ టిక్ ఇచ్చేది. దీన్ని చూసి ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మిగతా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ లు అనుసరించడం మొదలుపెట్టాయి.
అయితే ఇప్పటి వరకూ ఉచితంగా సెలబ్రిటీలు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లు, సంస్థలు వంటి అకౌంట్లను వెరిఫై చేసి బ్లూ టిక్ లు ఇచ్చిన ట్విట్టర్ ఇక నుంచి బ్లూ టిక్ కోసం ప్రతి నెలా డబ్బులు చెల్లించాలని షరతు పెట్టబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
యూజర్ వెరిఫికేషన్ ప్రాసెస్ ను సవరించేందుకు సిద్ధమైనట్లు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.
వెరిఫికేషన్ ప్రక్రియ మొత్తం ఇప్పుడు పునరుద్ధరించబడుతోందని మస్క్ ట్వీట్ చేశారు. దీని గురించి పూర్తి వివరాలు వెల్లడించలేదు.
కానీ ట్విట్టర్ ఇక నుంచి అఫీషియల్ అకౌంట్లకి సంబంధించిన బ్లూ టిక్ కోసం ఛార్జీలను వసూలు చేయబోతుందన్న వార్తలు వస్తున్నాయి.
బ్లూ టిక్ కోసం సెలబ్రిటీ యూజర్లు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందేనని, లేదంటే బ్లూ టిక్ తొలగించబడుతుందని టెక్ వర్గాల సమాచారం.
4.99 డాలర్ల నుంచి 19.99 డాలర్లు నెల నెలా వసూలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మన భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 411.16 నుంచి 1647.20 రూపాయలు. ఇప్పటికే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో సబ్స్క్రిప్షన్ పద్ధతిలో డబ్బులు వసూలు చేస్తోంది ట్విట్టర్ సంస్థ. అమెరికాలో ప్రస్తుతం 5 డాలర్ల వరకూ వసూలు చేస్తోంది.