ఒక్కోసారి తప్పు లేకపోయినా కూడా కొంతమందిని తప్పుడు కేసుల్లో ఇరికించి జైల్లో బంధిస్తారు.
కేసు త్వరగా క్లోజ్ చేసేయాలి అని కొంతమంది పోలీసులు.. అమాయకులని ఇరికించే ప్రయత్నం చేస్తారు.
ఈ క్రమంలో అన్యాయంగా జైల్లో బంధించినప్పుడు వాళ్ళు తమ జీవితంలో ఎన్నో ఆనందాలను కోల్పోవాల్సి వస్తుంది.
కుటుంబంతో, పిల్లలతో గడిపే ఆనంద క్షణాలు కోల్పోతారు.
సమాజంలో పరువు పోతుంది. కుటుంబం రోడ్డున పడుతుంది.
జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాత అతను నిర్దోషిగా బయటకు వస్తే ఏం లాభముంటుంది చెప్పండి.
అందుకే ఓ వ్యక్తి తనకు జరిగిన అన్యాయానికి ప్రభుత్వంపై కేసు పెట్టాడు.
ఇన్నాళ్లు తాను కోల్పోయిన జీవితానికి పరిహారంగా 10 వేల కోట్లు చెల్లించాలని కోర్టులో పిటిషన్ వేశాడు.
మధ్యప్రదేశ్ లోని రాత్లాం జిల్లాకి చెందిన కాంతూ అనే గిరిజన వ్యక్తిని సామూహిక అత్యాచారం కేసులో రెండేళ్ల క్రితం అరెస్ట్ చేశారు పోలీసులు.
అయితే 665 రోజుల శిక్ష అనుభవించిన తర్వాత.. అతను నిర్దోషి అంటూ గత ఏడాది అక్టోబర్ లో కోర్టు తీర్పు ఇచ్చింది.
దీంతో ఈ రెండేళ్లు తన పడిన మానసిక వేదనకు, తన భార్యతో గడిపిన క్షణాలను కోల్పోయినందుకు..
తన కుటుంబం పడిన మానసిక వేదనకు ప్రతిఫలంగా 10 వేల 6 కోట్ల రూపాయలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశాడు.
దేవుడు బహుమతిగా ఇచ్చినటువంటి లైంగిక సుఖాన్ని కోల్పోయినందుకు నష్టపరిహారం చెల్లించాల్సిందే అంటూ కోర్టు మెట్లెక్కాడు.
క్షమాపణ చెప్తే సరిపోదని.. ఈ ప్రభుత్వం చేసిన పనికి 10 వేల 6 కోట్లు, అదనంగా కోర్టు ఖర్చులు, లాయర్ ఫీజు, ఇతర ఖర్చులు కలిపి మరో 2 లక్షలు ఇవ్వాల్సిందే అంటూ పట్టుబట్టాడు.