గర్భం దాల్చినప్పటి నుంచి తొమ్మిది నెలల వరకు గర్భంలో బిడ్డ ఎదుగుదలను బట్టి గర్భిణి పొట్ట ఎత్తు పెరుగుతూ వస్తుంది.
ప్రసవం తర్వాత పొట్ట తిరిగి సాధారణ స్థితిలోకి రావాలి.
అయితే డెలివరీ అనంతరం కూడా చాలా మంది స్త్రీలలో పొట్ట కాస్త ఎత్తుగానే కనిపిస్తూ ఉంటుంది.
ఇలా పొట్ట ఎత్తుగా కనిపించడంతో కొంతమంది మహిళలు అసౌకర్యంగా ఫీలవుతుంటారు.
అయితే ఈ సమస్యను కొన్ని సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఉదయాన్నే పరగడపున గోరువెచ్చటి నీళ్లు తాగడం చాలా మంచిది. దీనికి ఒక చెందాడు నిమ్మరసం, అరచెంచాడు తేనె కలిపి తీసుకుంటే రుచికరంగా ఉంటుంది.
నిమ్మరసం, తేనెతో కలిపి తయారు చేసుకున్న మిశ్రమాన్ని భోజనానికి ముందు కూడా తాగొచ్చు.
ఈ మిశ్రమాన్ని తరచూ తీసుకంటే మంచి ఫలితం తప్పకుండా కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు.
రెండు లీటర్ల నీళ్లలో మూడు లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేయాలి. దీన్ని ఒక పది నిమిషాల పాటు మరిగించాలి.
ఈ మిశ్రమాన్ని 40 రోజుల పాటు తాగాలి. ఇలా చేయడం వల్ల పొట్ట తగ్గి నాజూగ్గా తయారయ్యే అవకాశం ఉంటుంది.
ఇదే పద్ధతిని లవంగాలు, దాల్చిన ముక్కకు బదులుగా బార్లీ, వాము.. చెంచాడు చొప్పున వేసి కూడా ప్రయత్నించొచ్చు.
రోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే కొన్ని రోజుల్లోనే మంచి ఫలితాలు వస్తాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
అదే విధంగా రోజూ ఒక యాపిల్ తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆహారం ద్వారా వచ్చే కొవ్వుల్ని శరీరం గ్రహించకుండా చేయడంతో పాటు జీవక్రియల్ని వేగవంతం చేస్తుందట. దీని వల్ల పొట్ట తగ్గి నాజూగ్గా మారతారట.
యాపిల్‌తో పాటు ఆయా సీజన్లలో దొరికే తాజా పండ్లు, కాయగూరలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పిల్లలకు డబ్బా పాలు కాకుండా తల్లి పాలు పట్టడం ద్వారా కూడా పొట్ట సమస్యను తగ్గించుకోవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
పొట్ట తగ్గడం కోసం డైటింగ్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఇది మీరు పాలిచ్చే బిడ్డపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సిజేరియన్, సాధారణ కాన్పు.. వీటిలో ఏ పద్ధతిలో ప్రసవం జరిగినా ఆరు నెలల వరకు బరువులెత్తడం, త్వరగా పొట్ట తగ్గాలని మీకు ఉన్న బలాన్ని అంతా ప్రయోగించి కఠినమైన ఎక్సర్సైజ్లు చేయడం అస్సలు మంచిది కాదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.