మగవారితో పోల్చితే ఆడవారికి వచ్చే అనారోగ్య సమస్యలు వేరుగా ఉంటాయి. కొన్ని రకాల సమస్యల గురించి ఎవరికి చెప్పుకోలేం కూడా.
అందుకే ఆడవారు తమ ఆరోగ్యంపట్ల మరింత శ్రద్ధ వహించాలి. ఇక ఆడవారు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని రకాల విటమిన్లను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి అంటున్నారు వైద్యులు.
మరీ ముఖ్యంగా ఆడవారు పోషకాహారం ఎక్కువగా తీసుకోవాలి. తమ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ చూపాలి.
ఆడవారికి అవసరమైన అతి ముఖ్యమైన విటమిన్స్‌లో విటమిన్ ఏ ముందువరుసలో ఉంటుంది.
మరీ ముఖ్యంగా 40-45 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఆడవారిలో అనేక అనారోగ్య సమస్యలు వెలుగు చూస్తుంటాయి. మోనోపాజ్ దశ ప్రారంభం అవుతుంది.
అందుకే ఈ సమయంలో ఆడవారు విటమిన్ ఏ అధికంగా లభించే ఆహారం అనగా గుమ్మడి గింజలు, బచ్చలి కూర, క్యారెట్లు, బొప్పాయి తీసుకోవాలి.
మహిళకు మరీ ముఖ్యంగా గర్భిణీలకు విటమిన్ బీ9 ఎంతో అవసరం.
ఇది లోపిస్తే.. పిల్లల్లో పుట్టుకతోనే అనేక అనారోగ్య సమస్యలు, లోపాలు వెలుగు చూస్తాయి.
అందుకే గర్భవతులు విటమిన్ బీ9 అధికంగా లభించే బీన్స్, ఈస్ట్ వంటి ఆహారాలను తరచుగా తీసుకోవాలి.
మహిళల ఆరోగ్యానికి అతి ప్రధానమైన విటమిన్ .. విటమిన్ డి. ఎముకలు బలంగా ఉండేందుకు చాలా అవసరం.
విటమిన్ డి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. కాల్షియం కూడా ఎముకల బలానికి సహాయపడుతుంది.
విటమిన్ డి లభించాలంటే.. ప్రతిరోజూ ఉదయం 15 నుంచి 30 నిమిషాలు ఎండలో ఉంటే సరిపోతుంది అంటున్నారు నిపుణులు.
అలాగే కొవ్వు చేపలు, పాలు, గుడ్లు, పుట్టగొడుగుల్లో కూడా విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ ఇ ఆడవారికి చాలా అవసరం. ఎందుకంటే ఇది జుట్టు, చర్మం, గోళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే చర్మంపై ముడతలను, మచ్చలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది.
విటమిన్ ఇ సమృద్ధిగా లభించాలంటే.. బచ్చలికూర, వేరుశెనగ వెన్న, బాదం పప్పులను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవాలి.
ఆడవారిలో విటమిన్ కె లోపిస్తే.. రుతుక్రమం, డెలివరీ సమయంలో రక్తస్రావం అధికంగా ఉంటుంది.
అందుకే మహిళలు కె విటమిన్ లోపం తలెత్తకుండా జాగ్రత్తపడాలి.
ఇక ఆకు కూరలు, సోయాబీన్ నూనెలో విటమిన్ కె పుష్కలంగా లభిస్తుంంది. వీటిని రోజు వారి ఆహారంలో భాగం చేసుకోవాలి అంటున్నారు నిపుణులు.