రోబోటిక్స్.. రానున్న రోజుల్లో ఇవి ప్రంపచాన్ని ఏలతాయని శాస్త్రవేత్తలు ఎంతో నమ్మకంగా చెప్తున్నారు. త్వరలోనే అన్ని రంగాల్లో రోబోలు ప్రవేశిస్తాయని అంటున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో రోబోలతో ఆపరేషన్ లు చేయించడం, హోటల్, మాల్స్ లో సర్వెంట్లుగా ఏర్పాటు చేసిన సంఘటనల గురించి చదివాం.

తాజాగా ఇరాన్ కి చెందిన ప్రముఖ డిజైనర్‌ రోబో కాకిని అభివృద్ధి చేశారు. చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా.. అధునాతన టెక్నాలజీతో దీన్ని సృష్టించారు. 

ఇక్కడ ఫొటోల్లో మనకు కనపడుతున్న కాకి నిజమైనది కాదు.. రోబో కాకి. ఇరాన్‌కు చెందిన కాన్సెప్ట్‌ డిజైనర్‌ అమీన్‌ అక్షీ ఈ రోబోకాకిని రూపొందించారు. అక్షీకి మొదటగా ఈ ఆలోచన వచ్చినపుడు హూడెడ్ కాకి గుర్తొచ్చిందట. 

ఇది సాధారణ రోబోకాకి మాత్రమే కాదు, డ్రోన్‌ కూడా. ఇందులో అన్నివైపులా కెమెరాలు, సెన్సార్లు అమర్చడంతో ఎక్కడికంటే అక్కడకు ఎగురుతూ పోయి వాలగలదు. రెక్కలను మెత్తగా జీవం ఉట్టిపడేలా రూపొందించడం, కాళ్ల పంజాలను ఎలాంటి ఉపరితలంపైన అయినా తేలికగా వాలి నిలబడేలా తీర్చిదిద్దడం ఇందులోని విశేషం. 

జన సామర్థ్యం ఎక్కువుగా ఉండే చోట్ల వాలడానికి కాకులు భయపడుతుంటాయని, వాటిలో ఆ భయం తొలగించే ఉద్దేశంతో ఈ రోబోకాకికి రూపకల్పన చేశానని అమీన్‌ చెబుతున్నారు. ఈ రోబోటిక్ కాకిలో అధునాతన కెమెరాలు,సెన్సార్‌లు ఉపయోగించినందున.. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా కనబడుతోంది. నిఘా వర్గాలు, రెస్క్యూ మిషన్‌లలో దీన్ని వాడుకోవచ్చా అనే విషయాన్నీ కూడా పరిశీలిస్తానని చెప్తున్నారు దీని సృష్టికర్త.