తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మరో మెగా ప్రాజెక్టును ప్రకటించింది.

 తెలంగాణలో త్వరలో మెగా టెక్స్​టైల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 

తెలంగాణతో పాటు మరో ఏడు రాష్ట్రాల్లో మెగా టెక్స్​టైల్ పార్కులు ఏర్పాటు కానున్నాయని మోడీ చెప్పుకొచ్చారు. 

ఈ టెక్స్​టైల్ పార్కుల ఏర్పాటు ద్వారా రూ.వేల కోట్లు పెట్టుబడులు, లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుందని మోడీ అన్నారు. 

తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్​కు ఇది గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని మోడీ పేర్కొన్నారు. 

 మెగా టెక్స్​టైల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించి 13 రాష్ట్రాల నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. 

ఆ లిస్టులో నుంచి తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్​లను కేంద్ర జౌళి శాఖ ఎంపిక చేసింది. 

పార్కుల ఏర్పాటుకు సంబంధించి భూముల కేటాయింపు, సింగిల్ విండో అనుమతులు, విద్యుత్తు, నీటి వసతి తదితరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాల్సి ఉంటుంది. 

ఈ మెగా పార్కుల ఏర్పాటుకు కనీసం 1,000 ఎకరాల భూమి అవసరం అవుతుందని తెలుస్తోంది. 

పీఎం మిత్ర పథకంలో భాగంగా ఏర్పాటు కానున్న ఈ పార్కులకు మద్దతుగా రూ.300 కోట్లు అందించనుంది కేంద్రం. 

తెలంగాణకు వచ్చేసరికి.. వరంగల్​ లేదా సిరిసిల్లలో ఏదో ఒకచోట మెగా టెక్స్​టైల్ పార్క్ ఏర్పాటు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఈ పార్కు ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో లక్ష మంది వరకు ఉద్యోగాలు పొందే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

రాష్ట్రంలో ఇంత మందికి ఉపాధి కల్పించనున్న మెగా టెక్స్​టైల్ పార్క్ ఏర్పాటుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.