టాటా మోటార్స్ తమ ఎలక్ట్రిక్ వాహనాల రేంజ్ ను మరింత విస్తరించింది. నెక్సాన్ ఈవీ మ్యాక్స్ పేరిట మరో కొత్త కారును మార్కెట్లోకి విడుదల చేసింది.
గతంలో వచ్చిన నెక్సాన్ అప్‌డేటెడ్ వర్షన్ గా ఈ మోడల్ ను తీసుకొచ్చింది. ప్రస్తుత మోడల్‌కు పలు రకాల అప్‌డేటెడ్ ఫీచర్లను యాడ్ చేసింది.
రెండు వేరియంట్లలో నెక్సాన్ ఈవీని కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఎక్స్‌జెడ్ ప్లస్, ఎక్స్‌జెడ్ ప్లస్ లక్స్ వేరియంట్లలో నెక్సాన్ ఈవీని లాంచ్ చేసింది.
ఈ కారు ధరల శ్రేణి రూ.17.74-19.24 లక్షలు. ఇందులో ఎకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు డ్రైవిండ్ మోడ్లు ఉన్నాయి.
నెక్సాన్ ఈవీ మ్యాక్స్ బ్యాటరీ ప్యాక్ ఏఆర్ఏఐ సర్టిఫికేషన్‌తో 40.5 కిలోవాట్స్ పర్ అవర్‌గా ఉంది. నెక్సాన్ ఈవీతో పోలిస్తే దీని సామర్ధ్యం 33 శాతం అధికం.
ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే కారు 437 కి.మీ ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. దీన్ని 50 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ చార్జర్ తో 56 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేయొచ్చని కంపెనీ పేర్కొంది.
ఈ కారు ఇంజిన్ 250 ఎన్ఎం గరిష్ట టార్క్ దగ్గర 105 కేడబ్ల్యూ శక్తిని విడుదల చేస్తుంది. ఇది కేవలం 9 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.
మకరన్ ఇంటీరియర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, స్మార్ట్ వాచ్ ఇంటిగ్రేషన్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.
ముఖ్యంగా చెప్పాలంటే.. సడన్ బ్రేక్ వేసినప్పుడు కారు ఎక్కవ దూరం దూసుకెళ్లకుండా సురక్షితంగా ఆగేలా ‘ఇంటెలిజెంట్ వాక్యూమ్ లెస్ బూస్ట్ అండ్ యాక్టివ్ కంట్రోల్’ వ్యవస్థను అమర్చారు.
అన్ని వీల్స్ కు డిస్క్ బ్రేకులిచ్చారు. ప్యానిక్ బ్రేక్ అలర్ట్, పిల్లల కోసం ప్రత్యేకమైన ఐసోఫిక్స్ యాంకరేజ్ సీటు, ముందు భాగంలో రెండు ఎయిర్ బ్యాగులు వంటి అత్యాధునిక ఫీచర్లున్నాయి.
ఈ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను ప్రస్తుతం 75కి పైగా నగరాలలో 210 టచ్ పాయింట్లలో విక్రయిస్తోంది. ఈ ఏడాది మరో 70 టచ్ పాయింట్లను అదనంగా తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది.