టాటా నానో పేరు తెలియని జనం ఉండరు. మధ్యతరగతి వాళ్ళ బడ్జెట్ కారు. బైక్ మీద నలుగురు వెళ్లడం కష్టంగా ఉంది, ఒక కారు కొనుక్కోవాలి అని కలలు కనే మధ్యతరగతి కుటుంబాల వారి కోసం రతన్ టాటా సృష్టించిన బడ్జెట్ కారు ఈ నానో.
ద్విచక్ర వాహనం ధరలో మిడిల్ క్లాస్ వారికి కారుని అందించాలన్న సంకల్పంతో రతన్ టాటా తయారుచేసిన కలల కారు ఈ నానో. 2008లో వచ్చిన ఈ కార్లు అందుబాటులోకి వచ్చాయి.
మొదట్లో వీటి డిమాండ్ బాగా ఉండేది. ఎగబడి కొనుగోళ్లు చేశారు. అయితే రాను రాను క్రేజ్ తగ్గడంతో 2018లో నానో కార్ల తయారీని నిలిపివేసింది టాటా మోటార్స్ కంపెనీ. దీంతో చాలా మంది నిరుత్సాహపడ్డారు. నానో కారు మళ్ళీ వస్తే బాగుణ్ణు అని అనుకునేవారు చాలా మంది ఉంటారు.
అలాంటి వారి కోసం టాటా కంపెనీ మరోసారి నానో కారుని తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసారి సరికొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
పెరుగుతున్న పెట్రోల్ ధరల దృష్ట్యా విద్యుత్ వాహనాలని కొనుగోళ్లపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో నానో కారు ఎలక్ట్రిక్ వేరియంట్ లో తీసుకొస్తే.. మిడిల్ క్లాస్ వారికి బాగా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.
అందుకే నానో ఈవీ మోడల్ ని అందుబాటులోకి తెచ్చేందుకు కంపెనీ ప్రయత్నాలు చేపట్టిందట. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ లో కార్ల విక్రయాల్లో టాటా కంపెనీ వాటా 80 శాతంగా ఉంది. నెక్సాన్ ఈవీ, టిగార్ ఈవీ, టియాగో ఈవీ వాహనాల విక్రయాల్లో టాటానే నంబర్ వన్ గా ఉంది.
ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో టాటా కంపెనీ భవిష్యత్తులో మరిన్ని కార్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ క్రమంలో మిడిల్ క్లాస్ వారి బడ్జెట్ కారుని ఎలక్ట్రిక్ వేరియెంట్ లో తీసుకురావాలని యోచిస్తుంది.
అయితే పాత డిజైన్ లో కాకుండా ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టు డిజైన్ లో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అధునాతన ఫీచర్స్ తో, సరికొత్త డ్యాష్ బోర్డుతో మరింత స్టైలిష్ గా నానోని డిజైన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం కలిగిన 17 కిలో వాట్ హవర్ బ్యాటరీ, పవర్ ఫుల్ మోటార్ తో దీన్ని రూపొందించనున్నట్లు తెలుస్తోంది. సిటీల్లో తిరిగేలా ఈ కారుని తయారు చేస్తున్నారట. అయితే టాటా మోటార్స్ దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.
ఒకవేళ ఇదే గనుక నిజమైతే టాటా కంపెనీ విడుదల చేయబోతున్న 10 ఈవీ కార్లలో నానో ఈవీ కూడా ఉండే అవకాశం ఉంది. టాటా తయారుచేస్తున్న 10 ఈవీ మోడల్స్ రాబోయే 5 ఏళ్లలో లాంచ్ అవ్వనున్నాయి.
అయితే నానో కారు ఈ లోపే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. నానో కారు ధర కూడా 2 నుంచి 3 లక్షల మధ్యలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్ లో కనుక టాటా కంపెనీ కారు అందిస్తే.. మిడిల్ క్లాస్ వారికి పండగే.
పెట్రోల్ బాధ ఉండదు. ఎంచక్కా కుటుంబంతో కలిసి ఊర్లు వెళ్ళచ్చు. మిడిల్ క్లాస్ వారికి చౌక ధరకే కారు అందించాలన్న రతన్ టాటా సంకల్పం కూడా నెరవేరుతుంది. పైగా పెట్రోల్ ధరల భారం ఉండదు. ఇప్పుడు నానో కారు విలువ ప్రతీ ఒక్కరికీ తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నానో కారు అవసరం ఈ మిడిల్ క్లాస్ వారికి ఉంది.