లక్ష రూపాయలతో ఈరోజుల్లో సంపాదించడం కష్టమండి.

అప్పుగా ఇస్తే రూ. 2 వేలకు మించి వడ్డీ రాదండి. అబ్బే లక్షతో ఎదగడం కష్టమండి.

ఏంటి మీరు కూడా ఇలానే ఆలోచిస్తున్నారా? అయితే మీరు ఈ యువతి కథ తెలుసుకుంటే మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు.

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుందని అంటారు. తెలివితేటలు, నమ్మకం ఉండాలే గానీ రూపాయి పెట్టుబడితో కూడా ఎదిగే వారు ఉంటారు.

ఈ యువతి పేరు ఆరుషి అగర్వాల్. వయసు 27 ఏళ్ళు. ఉండేది ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ జిల్లా.

చదువుకునే సమయంలోనే క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది. రెండుసార్లు రూ. కోటి జాబ్ ఆఫర్ వస్తే సున్నితంగా తిరస్కరించారు.

ఈమెకేమైనా పిచ్చా అని అనుకోకండి. రూ. కోటి కోసం జాబ్ లో జాయినైతే 10 లక్షల మందికి ఈమె వల్ల ఉద్యోగాలు వస్తాయా?

ఇవాళ రూ. 50 కోట్ల విలువైన కంపెనీకి అధినేత్రి అయ్యేవారా?

ఆమె లక్ష్యం వేరే. క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వని నిరుద్యోగులకు జాబ్ వచ్చేలా చేయడమే ఆమె ఉద్దేశం.

అందుకోసం లక్షతో పెట్టుబడి పెట్టి ఒక చిన్న కంపెనీని ప్రారంభించారు ఆరుషి అగర్వాల్.

2020లో కరోనా సమయంలో టాలెంట్ డీక్రిప్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేశారు. మూడేళ్ళలో కంపెనీ విలువ 50 కోట్లు అయ్యింది.   

ఈ కంపెనీ కోసం ఆమె కోడింగ్ నేర్చుకుని ఒక సాఫ్ట్ వేర్ ని రూపొందించారు.

మూడేళ్ళలో ఈ సాఫ్ట్ వేర్ ద్వారా 10 లక్షల మంది విదేశాల్లో ఉద్యోగాలు పొందారు.

ఈ సాఫ్ట్ వేర్ ద్వారా ఇంట్లోనే ఉంటూ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ అటెంప్ట్ చేయవచ్చు.

ఇందులో పాసైతే నేరుగా పెద్ద పెద్ద సంస్థల్లో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.