ప్రస్తుత కాలంలో గుండెపోటు మరణాలు అధికమవుతున్నాయి.

అంతసేపు సంతోషంగా ఉన్న వాళ్లు.. సడెన్‌గా కుప్పకూలడం, మృత్యువాత పడటం ప్రతి ఒక్కరిని కలవరపెడుతోంది.

సడెన్‌, సైలెంట్‌ గుండెపోటు మరణాలు పెరగడంతో చాలా అపోహలు వినిపిస్తున్నాయి.

మరీ ముఖ్యంగా కరోనా, కోవిడ్‌ టీకా, వైరస్‌ను అడ్డుకోవడం కోసం స్టెరాయిడ్స్‌ను వాడటం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది అంటున్నారు.

కరోనా కట్టడి కోసం తీసుకున్న వ్యాక్సిన్‌ కారణంగా ఈ గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి అనే అపోహ జనాల్లో బలంగా పాతుకుపోయింది.

అయితే ఈ వార్తలపై డాక్టర్లు స్పందిస్తూ.. ఇవన్ని కేవలం అపోహలు మాత్రమే అంటున్నారు.

కరోనా బారిన పడితే దాని ప్రభావం.. 6-12 వారాల వరకు మాత్రమే ఉంటుంది అని తెలుపుతున్నారు.

గత ఆరు నెలలుగా కరోనా కేసులు వెలుగు చూడటం లేదు. అలాంటప్పుడు కరోనా వల్లనే అని ఎలా చెబుతారు అని ప్రశ్నిస్తున్నారు.

కరోనాకున్న ప్రధాన లక్షణం ఏంటంటే.. వైరస్‌ బారిన పడ్డ వాళ్లలో క్లాట్స్‌ ఏర్పడతాయి.

అందరి విషయంలో ఇలా జరగకపోవచ్చు. కానీ కొందరిలో క్లాట్స్‌ ఏర్పడటం వల్ల గుండెపోటు, పెరాలసిస్‌ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

కోవిడ్‌ నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాత ఎకోస్ప్రిన్‌ ట్యాబ్లెట్‌ తీసుకుంటే ఆ సమస్యలను కూడా పరిష్కరించవచ్చు అని తెలిపారు.

చాలా మంది కోవిడ్‌ తర్వాత ఈ ట్యాబ్లెట్స్‌ వాడలేదని.. వారిలో ప్రధానంగా ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.

అలానే వ్యాక్సిన్‌ వల్ల గుండెపోటు వస్తుంది అనేది కూడా అపోహ మాత్రమే అంటున్నారు.

వ్యాక్సిన్‌ అనేది.. ఆయా వ్యాధులకు మన శరీరం తట్టుకునేట్టటుగా ఇమ్యూనిటీని పెంచుతుంది అంటున్నారు వైద్యులు.

కరోనా వ్యాక్సిన్‌ ప్రభావం కూడా ఆరు వారాల వరకు మాత్రమే ఉంటుందని.. ఏవైనా దుష్ప్రభవాలు ఉంటే.. అప్పుడే వెలుగులోకి వస్తాయని తెలిపారు.

ఇక మన దగ్గర అందరూ వ్యాక్సిన్‌ తీసుకుని కూడా సుమారు ఏడాది పైనే అవుతుంది.

కానీ గుండెపోటు మరణాలు గత కొన్ని నెలలుగా పెరుగుతున్నాయి. కనుక దీనికి, వ్యాక్సిన్‌ను సంబంధం లేదు అని.. జనాలు భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.