క్రెడిట్‌ కార్డు.. ప్రస్తుతం ఎంతో మందికి ఇదే ప్రధాన చెల్లింపు సాధనంగా మారుతోంది. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా క్రెడిట్‌ కార్డు వాడకం కూడా బాగా పెరిగింది.

అంతేకాకుండా బ్యాంకులు సైతం ఖాతాదారులను క్రెడిట్ కార్డు తీసుకునేలా, వాటిని ఉపయోగించేలా ప్రోత్సహిస్తున్నాయి. కానీ, ఇప్పటికీ చాలా మందికి అసలు క్రెడిట్‌ కార్డు ద్వారా వారు ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో, క్రెడిట్‌ కార్డు నుంచి ఏ విధంగా లాభపడవచ్చో తెలియదు.

కొందరికి దానిని ఉపోయోగించడం తెలియక ఇబ్బందులు కూడా పడుతుంటారు. అయితే అలాంటి వారికోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అవగాహన కల్పిస్తోంది.

అయితే అసలు క్రెడిట్‌ కార్డును ఎలా ఉపయోగించాలి? దానిద్వారా ఎలాంటి లాభాలు వస్తాయో చూద్దాం.

టైమ్‌కి చెల్లించాలి: మీకు క్రెడిట్‌ కార్డులో బిల్‌ జనరేట్‌ డేట్‌, డ్యూ డేట్‌ అని రెండు ఉంటాయి. ఈ రెండింటిన అస్సలు మర్చిపోకూడదు. బిల్‌ జనరేషన్‌ డే అంటే.. ఆ రోజు మీరు క్రెడిట్‌ కార్డుతో చేసిన చెల్లింపులను పరిగణలోకి తీసుకుని బిల్‌ని జనరేట్‌ చేస్తుంది.

బిల్‌ జనరేట్‌ అయిన తర్వాత డ్యూ డేట్‌ రోజు లేదా అంతకంటే ముందే మీరు మీ క్రెడిట్‌ కార్డు బిల్లుని కట్టాల్సి ఉంటుంది. అలా కట్టడంలో విఫలమైతే మీకు అదనంగా ఫైన్స్‌ పడటం, మీ సిబిల్‌ స్కోర్‌ కూడా తగ్గడం జరుగుతుంది.

అందుకే ఎప్పుడూ మీరు చెల్లింపులను డ్యూ డేట్‌లోపే చెల్లించాలి. అలా చేస్తే మీరు ఎలాంటి అదనపు రుసుములు, ఇబ్బందులు లేకుండా 40-45 రోజుల వడ్డీలేని పిరియడ్‌ని వాడుకోవచ్చు.

రివార్డులు: ప్రతి క్రెడిట్‌ కార్డుకు రివార్డుల ఇచ్చే విధానం ఉంటుంది. మీరు ఖర్చుచేసే ప్రతి రూపాయిని వాళ్లు పరిగణలోకి తీసుకుని అందుకు తగినట్లుగా రివార్డ్‌ పాయింట్స్‌ ఇస్తుంటారు.

అయితే ఎన్ని పాయింట్లు ఇస్తారు అనేది వాళ్ల షరతులు, మీరు తీసుకునే క్రెడిట్‌ కార్డుని బట్టి ఉంటుంది. ఆ రివార్డు పాయింట్లు మాకెందుకు అనుకుంటున్నారా? అయితే ఆ రివార్డు పాయింట్లతో మీరు మళ్లీ షాపింగ్‌ చేయవచ్చు.

అన్ని బ్యాంకులు వారు ఇచ్చే రివార్డు పాయింట్లను వినియోగించుకునేందుకు కొన్ని సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ప్రొడక్టలను అందుబాటులో ఉంచుంది. వారు ప్రొడక్టుకు పెట్టిన పాయింట్లను బట్టి మీ వద్ద రివార్డులకు తగ్గట్లు వస్తువును ఎంచుకోవచ్చు.

ఒకవేళ వస్తువుకు సరిపోను పాయింట్లు లేకపోతే ఎక్స్‌ ట్రా ఎంతకట్టాలో చూపిస్తారు. అందుకు తగినట్లు మీరు రివార్టు పాయింట్లను వినియోగించుకోవచ్చు. అంటే ఇది ఖర్చు మీద వచ్చే ఆదాయం అనమాట.

ప్రత్యేక డిస్కౌంట్లు: క్రెడిట్‌ కార్డులపై మీకు స్పెషల్‌ డిస్కౌంట్లు ఇస్తుంటారు. బ్యాంకులు, క్రెడిట్‌ కార్డు సంస్థలు కొన్ని కంపెనీలు, ఇ-కామర్స్‌ వంటి సైట్లతో ఒప్పందాలు చేసుకుంటాయి.

వాటి ఒప్పందాల ప్రకారం ఫలానా సైట్‌లో, ఫలానా కంపెనీ ఉత్పత్తులకు చెల్లింపులు చేసే సమయంలో మా బ్యాంకు ద్వారా చెల్లిస్తే మీకు అదనంగా 10శాతం డిస్కౌంట్‌ లభిస్తుంటుందని వెల్లడిస్తాయి.

ఇలాంటివి ఎక్కువగా ఫెస్టివల్‌ సీజన్లు, మెగా సేల్స్‌, కొన్ని షోరూమ్ల ఆఫర్లలో వస్తుంటాయి. ఇవి ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ఇలా రెండు విధాలుగా షాపింగ్‌ చేసే సమయంలో వాడుకోవచ్చు.

దీనిద్వారా కంపెనీ ఆ ప్రొడక్టు మీద ఇచ్చే డిస్కౌంట్స్‌, ఆఫర్లకు అదనపు ప్రయోజనం అనమాట.

ట్రావెల్‌ బెనిఫిట్స్‌: కొన్ని కొన్ని క్రెడిట్‌ కార్డ్స్‌ ట్రావెల్‌ బెనిఫిట్స్‌ ను బాగా ఆఫర్‌ చేస్తుంటాయి. కొన్ని బ్యాంకులు అయితే ఎక్కువగా ట్రావెల్‌ చేసేవారికి ప్రత్యేకంగా ట్రావెల్‌ క్రెడిట్‌ కార్డులు అంటూ తీసుకొచ్చాయి కూడా. ఈ కార్డుల వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.

మీకు రెండు, మూడు నెలలకొకసారి ఫ్రీగా ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌కి ప్రవేశం కల్పిస్తారు. కొన్నిసార్లు హోటల్స్‌ ఫ్రీగా స్టే చేసేందుకు వెసులుబాటు ఉంటుంది.

ఇంక యాత్రా డాట్‌ కామ్‌, మేక్‌ మై ట్రిప్‌ వంటి వెబ్‌సైట్లతో కలిసి మీకు అదనపు డిస్కౌంట్లు, ఆఫర్లను ఇస్తుంటాయి. ఇంక కార్డు భద్రత విషయానికి వస్తే.. కార్డు వెనుకవైపు ఉండే సీవీవీ, వాలిడిటీ, ఎక్స్‌పైరీ వంటివి ఎవరితో పంచుకోకూడదు. బ్యాంకులు కూడా అలాంటి సమాచారాన్ని అడగవు.

షాపింగ్‌ సమయంలోనూ బాగా నమ్మదగిన సైట్లలోనే మీ సమాచారాన్ని ఎంటర్ చేయండి. ఈ చిట్కాలను పాటించి మీ క్రెడిట్‌ కార్డు మీద వచ్చే అన్ని ప్రయోజనాలను అందుకోండి.