తెలుగు రాష్ట్రాల మధ్య రెండో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభమైంది.

దేశ ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో జెండా ఊపి వందే భారత్ రైలును ప్రారంభించారు.

సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ఈ రైలు.. మళ్లీ తిరుపతిలో మొదలై సికింద్రాబాద్ స్టేషన్​కు చేరుకుంటుంది. 

సికింద్రాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి సికింద్రాబాద్ మార్గాల్లో టికెట్ రేట్లలో స్వల్ప వ్యత్యాసం ఉంది.

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఛైర్​కార్ టికెట్ రేట్ రూ.1,680గా ఉంది. 

సికింద్రాబాద్ నుంచి నెల్లూరుకు రూ.1,270, సికింద్రాబాద్ నుంచి ఒంగోలుకు రూ.1,075, సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు రూ.865, సికింద్రాబాద్ నుంచి నల్గొండకు రూ.470గా ధరలను రైల్వే శాఖ నిర్ణయించింది. 

ఛైర్​కార్​, ఎగ్జిక్యూటివ్ ఛైర్​కార్​కు ఛార్జీల్లో వ్యత్యాసం దాదాపు రెట్టింపుగా ఉంది. 

సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఎగ్జిక్యూటివ్ ఛైర్​కార్ టికెట్ రేటు రూ.3,080గా ఉంది. 

సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు (20701) టైమింగ్స్ విషయానికొస్తే.. సికింద్రాబాద్ నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 2.30 గంటలకల్లా తిరుపతికి చేరుకుంటుంది. 

తిరుపతి-సికింద్రాబాద్ వందే భారత్ రైలు (20702) తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి.. రాత్రి 11.45 గంటలకల్లా సికింద్రాబాద్​కు చేరుకుంటుంది.  

వారంలో ఆరు రోజులు ఈ ట్రైన్ నడుస్తుంది. నిర్వహణ కోసం మంగళవారం ఈ రైలుకు సెలవు ప్రకటించారు.   

వందే భారత్​ ట్రైన్​లో ఆహార పదార్థాల (టిఫిన్, భోజనం)తో పాటు వార్తా పత్రికలను కూడా అందజేస్తారు.

టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే తమకు నచ్చిన ఫుడ్​ను ఎంచుకునే వీలును ప్యాసింజర్లకు కల్పించారు. 

సికింద్రాబాద్-తిరుపతి మధ్య టికెట్ బేస్​ ఫేర్​ను రూ.1,168గా దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. 

క్యాటరింగ్ ఛార్జీ రూ.308గా అధికారులు నిర్ణయించారు. భోజనం వద్దనుకుంటే రూ.1,168కే టికెట్​ను కొనుక్కోవచ్చు.