దేశ ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులదే కీలక పాత్ర.

వీటిలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ఉండే కోఆపరేటివ్ బ్యాంకులు కూడా ఉంటాయి.

కోఆపరేటివ్ బ్యాంకుల పనితీరు మెరుగ్గా లేకున్నా, మూలధనం లేకుండా దివాళా తీసే పరిస్థితిలో బ్యాంకులు ఉన్నా వాటిపై భారత రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

ఆ బ్యాంకులపై ఆంక్షలు విధిస్తుంటుంది. నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకుల లైసెన్సులను సైతం రద్దు చేస్తుంది.

ఈ క్రమంలో పేలవంగా ఉన్న కోఆపరేటివ్ బ్యాంకులను ఆర్బీఐ రద్దు చేసింది.  

2023 ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలల వ్యవధిలోనే 8 బ్యాంకుల లైసెన్సులను ఆర్బీఐ రద్దు చేసింది.

నిర్వహణ సరిగా లేకపోవడం, దివాళా అంచుకు చేరుకోవడం వంటి కారణాలతో కొన్ని కోఆపరేటివ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసింది.

ఈ బ్యాంకులలో సేవా వికాస్ కోఆపరేటివ్ బ్యాంకు, మిలాత్ కోఆపరేటివ్ బ్యాంకు, దక్కన్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు, ముధోల్ కోఆపరేటివ్ బ్యాంకు, బాబాజీ దాతే మహిళా అర్బన్ బ్యాంకు, రూపీ కోఆపరేటివ్ బ్యాంకు, శ్రీ ఆనంద్ కోఆపరేటివ్ బ్యాంకు, లక్ష్మీ కోఆపరేటివ్ బ్యాంకులు ఉన్నాయి.

భవిష్యత్తులో కూడా ఈ బ్యాంకుల్లో ఆదాయ మార్గాలు కనిపించే అవకాశం లేకపోవడంతో లైసెన్సులను రద్దు చేసింది.

2022వ ఆర్థిక సంవత్సరంలో 12 కోఆపరేటివ్ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసింది.

ఈ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు కొన్ని ఇతర బ్యాంకులకు కూడా జరిమానా విధించింది.

నియమాలను ఉల్లంఘించిన కారణంగా కొన్ని బ్యాంకులకు 50 వేల నుంచి 5 లక్షల వరకూ చలానా విధించింది.

మానిటరీ పాలసీ నిబంధనలు ఉల్లంఘించి రుణాలు మంజూరు చేయడం, లబ్ధిదారులకు వివరాలు వెల్లడించడంతో అశ్రద్ధ, అలసత్వం వహించడం వంటి కారణాల వల్ల ఆర్బీఐ ఆ బ్యాంకులకు జరిమానా వేసింది.  

ఈ బ్యాంకులు గనుక నియమాల ఉల్లంఘనను ఇలానే కొనసాగిస్తే ఆర్బీఐ ఈ బ్యాంకుల లైసెన్సులను రద్దు చేసే అవకాశం ఉంది.