ద్విచక్ర వాహనాలపై ప్రస్తుతం ఉన్న 28 శాతం జీఎస్టీని 18 శాతానికి తగ్గించాలని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

లక్షలాది మందికి అవసరమైన ద్విచక్ర వాహన విభాగాన్ని లగ్జరీ వస్తువుగా చూడకూడదని ఎఫ్ఏడీఏ పేర్కొంది.

ఈ మేరకు ఆర్థిక మంత్రి, జీఎస్టీ కౌన్సిల్ ఛైర్మన్ నిర్మలా సీతారామన్, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు ఎఫ్ఏడీఏ విజ్ఞప్తి చేసింది.

గత కొన్నేళ్లుగా ద్విచక్ర వాహనాల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయని.. మళ్ళీ ఈ పరిశ్రమను గాడిలో పెట్టేందుకు జీఎస్టీ తగ్గింపు నిర్ణయం తోడ్పడుతుందని ఎఫ్ఏడీఏ వివరించింది.

ఈ నిర్ణయంతో ద్విచక్రవాహనాల ధరలు సరసమైనవిగా ఉండడంతో పాటు డిమాండ్ ను మళ్ళీ తీసుకురావడంలో సహాయపడుతుందని పేర్కొంది.

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, కఠిన ఉద్గార నిబంధనలు, కోవిడ్-19 అనంతర ప్రభావాలు వంటివి ద్విచక్ర వాహనాల విక్రయాలపై ప్రభావం చూపించిందని, ప్రస్తుతం ఈ పరిశ్రమ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఎఫ్ఏడీఏ తెలిపింది.

ద్విచక్ర వాహనాలపై విధించిన ప్రస్తుత జీఎస్టీ రేటుని తగ్గించి సామాన్యులకు ధరలను మరింత అందుబాటులోకి తీసుకొచ్చే సమయం ఇదేనని జీఎస్టీ కౌన్సిల్ కి వివరించింది.

పన్ను తగ్గించడం వల్ల సామాన్యుడికే కాకుండా ద్విచక్ర వాహన పరిశ్రమకు కూడా ప్రోత్సాహం లభిస్తుందని.. 

అనేక మందికి ఉపాధి అవకాశాలను సృష్టించడంలో జీఎస్టీ తగ్గింపు నిర్ణయం సహాయపడుతుందని ఎఫ్ఏడీఏ తెలిపింది.

కొన్నేళ్లుగా ద్విచక్ర వాహనాల ధరలు భారీగా పెరిగాయని.. ఇది వినియోగదారుల కొనుగోలు శక్తిపై  ప్రభావం చూపుతుందని తెలిపింది.

కఠినమైన ఉద్గార నిబంధనలు, ముడి పదార్థాల ధరలు పెరగడం, అధిక పన్నులు, రుసుములు సహా అనేక కారణాలు పెరుగుదలకు కారణమవుతుందని ఎఫ్ఏడీఏ పేర్కొంది.

2016లో హోండా యాక్టివా ధర రూ. 52 వేలు ఉందని.. అది 2023లో రూ. 88 వేలకు చేరిందని ఎఫ్ఏడీఏ తెలిపింది.

అలానే 2016లో బజాజ్ పల్సర్ ధర రూ. 72 వేలు ఉంటే.. ఇప్పుడది రూ. లక్షన్నరకు చేరుకుందని తెలిపింది.

ధరల నిరంతర పెరుగుదల కారణంగా ద్విచక్ర వాహనాల విక్రయాలు క్షీణించాయని ఎఫ్ఏడీఏ తెలిపింది.

ద్విచక్ర వాహన పరిశ్రమ వృద్ధి పథాన్ని పునరుద్ధరించడానికి జీఎస్టీ కౌన్సిల్ జోక్యం అవసరమని ఎఫ్ఏడీఏ వివరించింది.

2016లో జరిగిన ఆటోమొబైల్ విక్రయాల్లో ద్విచక్ర వాహనాల వాటా 78 శాతం ఉందని.. 2022-23లో 72 శాతానికి పడిపోయిందని తెలిపింది.

28 శాతం ఉన్న జీఎస్టీని 18 శాతానికి తగ్గిస్తే ద్విచక్ర వాహన పరిశ్రమ మళ్ళీ ఊపందుకుంటుందని ఎఫ్ఏడీఏ జీఎస్టీ కౌన్సిల్ కి వివరించింది.