దువ్వాడ రైల్వే స్టేషన్‌ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.  ప్లాట్‌ ఫాం, రైలు మధ్యలో నలిగిన యువతి జీవితం విషాదంగా ముగియటం అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.

బుధవారం సదరు యువతి రన్నింగ్‌లో ఉన్న రైలు దిగుతూ  ప్లాట్‌ ఫాం, రైలు మధ్యలో పడిపోయింది. వాటి రెండిటి మధ్యా ఇరుక్కుపోయి నలిగిపోయింది. ఈ నేపథ్యంలోనే బయటకు రాలేక నరకం అనుభవించింది.

దాదాపు రెండు, మూడు గంటల పాటు అల్లాడిపోయింది. రైల్వే రెస్క్యూ సిబ్బంది ఆమెను అతి కష్టం మీద బయటకు తెచ్చారు. తీవ్ర గాయాల పాలైన ఆమెను వెంటనే కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఆమె చనిపోయింది.

ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరానికి చెందిన శశికళ దువ్వాడలో పీజీ చదువుతోంది. బుధవారం గుంటూరు-రాయగడ రైలులో దువ్వాడకు బయలుదేరి వెళ్లింది. దువ్వాడ రైల్వే స్టేషన్‌ వద్ద రన్నింగ్‌ ట్రైన్‌లోంచి ప్లాట్‌ ఫాం మీదకు దూకింది.

ఇంతకీ ఏం జరిగింది

ఆ దూకటంలో పొరపాటు జరిగిపోయింది. ప్రమాదవశాత్తు ఆమె రైలు, ప్లాట్‌ ఫాం మధ్యలో పడిపోయింది. రైలు ఆమె శరీరాన్ని ప్లాట్‌ ఫాంకు నొక్కి బాగా నలుపుతూ కొంత దూరం తీసుకెళ్లింది.

తర్వాత ఆగిపోయింది. యువతి మాత్రం వాటి రెండిటి మధ్యే ఉండిపోయింది. బయటకు రావటానికి ఎంతో ప్రయత్నించింది. కానీ, రాలేకపోయింది. అక్కడి వారు కూడా ఆమెను బయటకు తీసుకురావటానికి ప్రయత్నించి విఫలమయ్యారు.

తర్వాత రైల్వే రెస్క్యూ టీమ్‌ సిబ్బంది ప్లాట్‌ ఫాంను బద్దలు కొట్టి, ఆమెను బయటకు తీశారు. తర్వాత హుటాహుటిన కిమ్స్‌కు తరలించారు. అయితే, వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించక ఆమె మృత్యువాత పడింది.

శశికళ రైలులోంచి ప్లాట్‌ ఫాం, రైలు మధ్యలో పడిపోగానే బలమైన, ఓ మోస్తరు వేగంతో వెళుతున్న రైలు ఆమెను ప్లాట్‌ ఫాంకు నొక్కి నలిపేస్తూ ముందుకు పోయింది.

శశికళ మృతికి కారణాలేంటి?

ఆమె కొన్ని రౌండ్లు తిరిగింది. ఆ సమయంలోనే రైలు వేగానికి, బలానికి ఆమె పక్క టెముకలు పట,పట విరిగాయి. ఆ విరిగిన ఎముకలు ఊపిరితిత్తులలోకి దూసుకుపోయినట్లు సమాచారం.

దీంతో ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయని, ఇన్నర్‌ బ్లీడింగ్‌ కూడా అయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే బతికేది కావచ్చు.

రైలు ఆమెను నలిపిన సమయం నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లటం వరకు దాదాపు 3-4 గంటల సమయం పట్టింది. నాలుగు గంటల సమయంలో ఆమె శరీరంలో ఇన్నర్‌ బ్లీడింగ్‌ జరిగినట్లు తెలుస్తోంది.

విరిగిన ఎముకలు ఊపిరితిత్తులను పంక్షర్‌ చేయటంతో ఊపిరి తీసుకోవటంలో సమస్య ఏర్పడి శశికళ చనిపోయినట్లు సమాచారం.