ఈఎంఐలు కట్టే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా శుభవార్త చెప్పింది. 

మెజారిటీ నిపుణుల అంచనాలకు భిన్నంగా వడ్డీరేట్ల పెంపు విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

కఠిన చర్యలు తీసుకుంటే ఎక్కడ వృద్ధికి ఆటంకాలు వస్తాయోనని ఆర్బీఐ వెనకడుగు వేసింది. 

కీలకమైన రెపోరేటులో ఎలాంటి మార్పులు చేయకుండా 6.50 శాతం దగ్గర యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.

రెపోరేటుపై కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు చేస్తున్న పోరాటం ఆగబోదని శక్తికాంత దాస్ ప్రకటించారు. 

రెపోరేటును యథాతథంగా కొనసాగిస్తూ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో రుణ గ్రహీతలకు భారీ ఊరట కలుగుతుందని చెప్పొచ్చు. 

గత కొన్నాళ్లుగా ఆర్బీఐ రెపోరేటును పెంచుతుండటంతో బ్యాంకులు కూడా రుణ రేట్లు, డిపాజిట్ రేట్లను పెంచేస్తున్నాయి. 

ఆర్బీఐ రెపోరేటు పెంపు వల్ల హోమ్ లోన్స్​తో పాటు రెపో లింక్డ్ రుణ రేట్లు కూడా భారీగా పెరిగాయి.

దీని వల్ల లోన్స్ తీసుకున్న వారిపై తీవ్ర ప్రభావం పడుతోంది. 

ఈఎంఐ పెరగడం లేదా మొత్తంగా లోన్ టెన్యూర్ కూడా పెరుగుతూ వచ్చింది. 

కొత్తగా లోన్ తీసుకోవాలని అనుకునే వారు కూడా అధిక వడ్డీ రేటు భారాన్ని మోయాల్సి ఉంటుంది. 

 ఇప్పుడు రెపోరేటును యథాతథంగానే కొనసాగిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వారందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి.