క్రియేటివ్ దర్శకుడిగా కృష్ణవంశీకి మంచి పేరుంది. అలాంటి ఆయన నుంచి సినిమా వచ్చి ఐదేళ్ల పైనే అవుతుంది.
లాంగ్ గ్యాప్ తర్వాత రంగమార్తాండ అనే చిత్రంతో మన ముందుకు వచ్చారు.
మరాఠీలో క్లాసిక్ హిట్ గా నిలిచిన నట్ సామ్రాట్ అనే సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నటించారు.
కృష్ణవంశీ సినిమాలంటే ఒక శైలి ఉండేది. ఈ మధ్యకాలంలో కృష్ణవంశీ మార్కు దర్శకత్వం ఆయన తెరకెక్కించిన ఏ సినిమాలోనూ కనబడలేదు.
మరి రంగమార్తాండ సినిమా కృష్ణవంశీని మళ్ళీ మనకి తిరిగి తీసుకొచ్చి ఇచ్చిందా? ఉగాది కొత్త సంవత్సరాన కొత్త వెలుగులు తెచ్చిందా? ఉగాది పచ్చడిలా ఈ చిత్రంలో అన్ని రుచులూ సమపాళ్లలో ఉన్నాయా? అనేది రివ్యూలో చూద్దాం.
కథ: రాఘవరావు (ప్రకాష్ రాజ్) గొప్ప రంగస్థల నటుడు. ఆయన నటనకు ఎంతోమంది అభిమానులు ముగ్ధులయిపోయి ఆయనకు రంగమార్తాండ అనే బిరుదు ఇస్తారు.
అయితే బిరుదు తీసుకునే సమయంలో విరామం తీసుకుంటున్నానని చెప్పి అందరికీ షాక్ ఇస్తారు.
కొడుకు రంగారావు (ఆదర్శ్), కూతురు శ్రీ (శివాత్మిక రాజశేఖర్) లకు ఆస్తులు పంచేస్తాడు. కూతురికి ప్రేమించిన వ్యక్తితో (రాహుల్ సిప్లిగంజ్) వివాహం జరిపిస్తాడు.
ఇష్టపడి, కష్టపడి కట్టుకున్న ఇంటిని కొడుకు, కోడలు గీతలకు (అనసూయ) వదిలేసి భార్యతో (రమ్యకృష్ణ) శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని బయటకు వెళ్ళిపోతాడు.
అసలు ఇంట్లోంచి ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది? ఇష్టపడి కట్టుకున్న ఇంటిని వదిలేసి వెళ్లిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది?
తన శేష జీవితాన్ని రాఘవరావు ఆనందంగా గడిపాడా? చిన్ననాటి స్నేహితుడు చక్రి (బ్రహ్మానందం), భార్య కోసం రాఘవరావు ఏం చేశాడు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ: రంగమార్తాండ అనే రంగస్థల నటుల జీవితాలు నిజ జీవితంలో ఎలా ఉంటాయో అనేది ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు.
ప్రతీ సన్నివేశం తెలుగు నాటకాలు, పద్యాలతో భావోద్వేగంగా ఉంటుంది. కథ కాస్త నెమ్మదిగా ఉన్నా భావోద్వేగభరిత సన్నివేశాలు కట్టిపడేస్తాయి.
ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశానికి కళ్ళమ్మట నీళ్లు వస్తాయి. రాఘవరావు భార్యకు సేవలు చేసే సన్నివేశాలు హృదయానికి హత్తుకునే విధంగా ఉంటాయి.
సెకండాఫ్ లో ప్రతీ సన్నివేశం భావోద్వేగంతో నిండి ఉంటుంది. కూతురు ఇంటికి వెళ్లిన రాఘవరావు దంపతులకు ఎదురైన అవమానాలు, ప్రాణ స్నేహితుడు చక్రి జీవితంలో చోటు చేసుకున్న విషాదం గుండెను బరువెక్కిస్తాయి. క్లైమాక్స్ గుండెని పిండేసేలా ఉంటుంది.
నటీనటుల పనితీరు: రాఘవరావు పాత్రలో ప్రకాష్ రాజ్ ఇరగదీశారు. రాఘవరావు భార్యగా రమ్యకృష్ణ, ప్రాణ స్నేహితుడైన చక్రి పాత్రలో బ్రహ్మానందం అద్భుతంగా నటించారు.
ఈ సినిమాకి పెద్ద బలం బ్రహ్మనందం. ఎప్పుడూ హాస్యం పండించే హాస్య బ్రహ్మ.. ఈ సినిమాలో గుండె బరువెక్కే నటనతో ఆకట్టుకున్నారు.
ఆయన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు బ్రహ్మానందం.
ఇక అనసూయ, ఆదర్శ్, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు తమ తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు: రంగమార్తాండ సినిమాకి ఇళయరాజా సంగీతం మరొక బలం. ఆయన తన సంగీతంతో సినిమాని పైన నిలబెట్టారు.
గందరగోళ సంగీతం కాకుండా ఆహ్లాదకరమైన చక్కని నేపథ్య సంగీతంతో ఇళయరాజా మెస్మరైజ్ చేశారు.
పాటలు కూడా సినిమాలో భాగంగానే సాగుతాయి. సినిమాటోగ్రఫీ వర్క్, ఎడిటింగ్ వర్క్, నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్‌లు: ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం నటన ఇళయరాజా సంగీతం భావోద్వేగభరిత సన్నివేశాలు
మైనస్‌లు: సన్నివేశాలు ప్రేక్షకుడి అంచనాకు తగ్గట్టు ఉండడం తారాబలం లేకపోవడం
చివరి మాట: రంగమార్తాండ తప్పకుండా చూడాల్సిన సినిమా..