గోపీచంద్ కి సరైన హిట్ పడి చాలా రోజులైంది. హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

పక్కా కమర్షియల్ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో రామబాణం సినిమా మీదే నమ్మకం పెట్టుకున్నారు.  

లక్ష్యం, లౌక్యం వంటి హిట్ సినిమాలను అందించిన శ్రీవాస్ ముచ్చటగా మూడోసారి గోపీచంద్ తో జతకట్టారు.

మరి వీరి కాంబినేషన్ లో విడుదలైన రామబాణం దూసుకెళ్ళిందా? లేదా?

కథ: రాజారామ్ (జగపతిబాబు) సొంత ఊర్లో ఉంటూ ఒక హోటల్ ను నిర్వహిస్తూ ఉంటాడు. 

సేంద్రీయ ఆహార పదార్థాలతో చేసిన టిఫిన్లను తయారు చేసి అమ్ముతుంటాడు. దీంతో రాజారామ్ కు మంచి గుర్తింపు వస్తుంది.

అది జీకే (తరుణ్ అరోరా), తన మేనమామ (నాజర్) లకు నచ్చదు. అక్కసుతో రాజారామ్ తో గొడవ పెట్టుకుంటారు.

రాజారామ్ పై దౌర్జన్యం చేసి హోటల్ లైసెన్స్ ను తీసుకెళ్ళిపోతారు.

రాజారామ్ తమ్ముడు విక్కీ (గోపీచంద్) వారిని కొట్టి లైసెన్స్ తీసుకొస్తాడు. అది రాజారామ్ కి నచ్చదు.

ఏం చేసినా చట్టపరంగా చేయాలని అంటాడు. ఇలాంటి పనులు చేస్తే ఉన్నతమైన స్థాయికి ఎదగరని అంటాడు.

విక్కీని పోలీసులకు అప్పగించాలని రాజారామ్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాడు.

ఈ క్రమంలో విక్కీ ఊరొదిలి కలకత్తా వెళ్ళిపోతాడు. ఎప్పటికైనా ఉన్నతమైన వ్యక్తిగా తిరిగొస్తానని అంటాడు.

మరి విక్కీ అనుకున్నది సాధించాడా? లేదా? ఇన్నేళ్లు ఏం చేశాడు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ: హీరో ఊరొదిలి పారిపోయి తిరిగి తన కుటుంబ సభ్యులను కలుసుకోవడం అన్న కాన్సెప్ట్ తో అనేక సినిమాలు వచ్చాయి. 

ఈ సినిమా కూడా అలాంటి కాన్సెప్ట్ తోనే తెరకెక్కింది.

ఈ సినిమాలో హీరో కలకత్తా పారిపోయి అక్కడ విక్కీ బాయ్ గా ఎదుగుతాడు. భైరవి అనే యూట్యూబర్ తో ప్రేమలో పడతాడు.

అక్కడ నుంచి కథ మలుపు తీసుకుంటుంది. ఈ మలుపు కూడా అంత ఆసక్తికరంగా ఉండదు.  

విలన్లతో గొడవ, అన్నదమ్ముల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్, ప్రేమ కథ ఇవన్నీ కొత్తగా అనిపించవు.

ఐతే ఈ సినిమా ద్వారా సేంద్రీయ ఆహార పదార్థాల గురించి మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందేశాన్ని చెప్పడం కోసమే అయితే కథను ఇంకా బాగా రాసుకోవచ్చు.    

అలీ, సప్తగిరి, గెటప్ శ్రీను, వెన్నెల కిషోర్, సత్య వంటి కమెడియన్స్ ఉన్నా గానీ కామెడీకి కొరత ఏర్పడింది.  

యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. ఫైట్స్ మాస్ ప్రేక్షకులకు నచ్చుతాయి.

నటీనటుల పనితీరు: గోపీచంద్ నటనను నిరూపించుకునే రేంజ్ రోల్ ఐతే ఈ సినిమాలో కనిపించదు. ఇక రాజారామ్ గా జగపతిబాబు సాఫ్ట్ రోల్ లో ఆకట్టుకున్నారు. 

డింపుల్ హయాతీ హీరో కోసం జోడీ అన్నట్టుగా ఉంటుంది అంతే. డ్యాన్సులు మాత్రం బాగా వేసింది.

కుష్బూ, నాజర్, తరుణ్ అరోరా, రాజా రవీంద్ర తదితరులు ఉన్నంతలో బాగా నటించారు.

అలీ, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సప్తగిరి వంటి వారిని సరిగా ఉపయోగించుకోలేదు దర్శకుడు.  

సాంకేతిక వర్గం పనితీరు: మిక్కీ జే మేయర్ సంగీతం, వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

దర్శకుడు శ్రీవాస్ టేకింగ్, స్క్రీన్ ప్లే, కథను ఆసక్తికరంగా మలచడంలో విఫలమయ్యారు.

ప్లస్ పాయింట్స్: సేంద్రీయ ఆహార ఉత్పత్తుల నేపథ్యం పోరాట సన్నివేశాలు సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ కథ, కథనం సన్నివేశాలు

చివరగా: రామబాణం టార్గెట్ మిస్ అయ్యింది

రేటింగ్: 2/5

గమనిక: ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే