బ్రహ్మానందం, స్వాతి, సముద్రఖని, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద తదితరులు నటించిన పంచతంత్రం సినిమా డిసెంబర్ 9న విడుదల అయ్యింది.

ఐదు విభిన్నమైన కథలతో సాగే ఈ సినిమాని దర్శకుడు హర్ష పులిపాక తెరకెక్కించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.

కథ: వేదవ్యాస్ (బ్రహ్మానందం) ఒక రిటైర్డ్ ఉద్యోగి. 60 ఏళ్ల వయసులో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని అనుకుంటాడు. 

అందుకోసం స్టాండప్ స్టోరీ టెల్లింగ్ పోటీల్లో పాల్గొంటాడు. అక్కడ ఐదు కథలు చెబుతాడు. ఐదు కథలు పంచేంద్రియాలకు సంబంధించినవి.

కన్ను(చూపు), ముక్కు(వాసన), నాలుక(రుచి), చెవి(వినికిడి), చర్మం(స్పర్శ) చుట్టూ తిరిగే కథలని బ్రహ్మానందం చెబుతూ ఉంటాడు.

విహారి అనే అంధుడిది మొదటి కథ. పెళ్లి చేసుకోబోయే భాగస్వామి పట్ల ఎటువంటి అభిరుచి కలిగి ఉండాలని చెప్పే రెండవ కథ.

అరుదైన వ్యాధి కలిగిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి కథ మూడవది. అప్పుడే పుట్టబోయే బిడ్డ స్పర్శని పొందే మధ్యతరగతి వ్యక్తి కథ నాల్గవది. 

శ్రోతలను అలరించే స్టోరీ టెల్లర్ కథ ఐదవది. ఈ ఐదు కథలు వేటికవే ప్రత్యేకం.

ఒక్కొక్కరికీ ఒక్కో కల ఉంటుంది. ఆ కల ఎలా నెరవేరిందన్నది కథలోని కథల సారాంశం.

విశ్లేషణ: పంచేంద్రియాల కాన్సెప్ట్ తో దర్శకుడు కథ బాగా రాసుకున్నారు. వీటన్నిటికీ కలిపి ఒక కథగా చెప్పడం అంటే సాహసమనే చెప్పాలి.

ప్రతీ కథ చూసే ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. తమ జీవితంలో జరిగినట్టుగా అనిపిస్తుంది.

అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు సాగదీత అనుభూతిని కలిగిస్తాయి. అయితే చివరి మూడు కథలు మాత్రం భావేద్వేగానికి గురి చేస్తాయి

ఇక క్లైమాక్స్ అయితే గుండెని పిండేసేలా ఉంటుంది. 

నటీనటుల విషయానికొస్తే.. బ్రహ్మానందం సీరియస్ రోల్ లో బాగా నటించారు.

స్వాతి, శివాత్మిక రాజశేఖర్, సముద్ర ఖని, రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద, నరేష్ అగస్త్య తమ పాత్రల మేరకు బాగా నటించారు.  

కెమెరా పని తీరు, ఎడిటింగ్ ఆకట్టుకుంటాయి. డైలాగ్స్ బాగున్నాయి. సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

ప్లస్ లు: కథ, కథనం, దర్శకత్వం సంగీతం సినిమాటోగ్రఫీ

మైనస్ లు: సాగదీతగా అనిపించే సన్నివేశాలు, స్లో నెరేషన్ సహనానికి పరీక్షలా అనిపిస్తాయి.

చివరి మాట: విస్తరిలో పంచభక్ష్య పరమాన్నాలు ఈ పంచతంత్రం

రేటింగ్: 2.5

గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!