ఎలాంటి లోపం లేకపోయినా సరే.. కష్టపడి పని చేయాలంటే కొందరికి బద్దకం.

కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం కాళ్లు చేతులు లేకపోయినా.. ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తున్నాడు.

తాజాగా ఏపీ ప్రభుత్వం అతడి జీవితాన్ని పాఠంగా మార్చి.. టెన్త్‌ క్లాస్‌ ఇంగ్లీష్‌లో చేర్చింది.

ఆ వ్యక్తి పేరు నిక్‌ వుజిసిక్‌. ప్రపంచంలోనే గొప్ప వక్తగా పేరు సంపాదించుకున్నాడు.

అలాంటి నిక్‌ వుజిసిక్‌.. తాజాగా భారత్‌ పర్యటనలో భాగంగా గుంటూరు వచ్చి.. ఏపీ సీఎం జగన్‌ని కలిశారు.

నిక్‌ వుజిసిక్‌ 1982, డిసెంబర్‌ 4న ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్‌లో దుసంక, బోరిస్లావ్‌ వుజిసిక్‌ అనే దంపతులకు జన్మించాడు.

టెట్రా అమీలియా అనే అరుదైన వ్యాధి కారణంగా పుట్టుకతోనే కాళ్లు, చేతులు లేకుండా జన్మించాడు నిక్‌.

నిక్‌కు చేతులు పూర్తిగా లేవు.. కాళ్లు మాత్రం కాస్త ఉంటాయి. వాటిని అతడు చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌తో పోల్చుతాడు.

భూమ్మీద పడగానే నిక్‌ రూపం చూసిన అతడి తల్లిదండ్రులు తనని దగ్గరకు తీసుకోలేదు. ఆస్పత్రిలోనే వదిలి వెళ్లారు. ఆ తర్వాత వచ్చి తీసుకెళ్లారు.

తల్లిదండ్రులు తనను ఎంత ప్రేమగా చూసుకున్నా సమాజం చేసే అవమానాలను భరించలేక.. ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు నిక్‌. ఆ ప్రయత్నం కూడా చేశాడు.

ఇక నిక్‌ పదిహేడో ఏట ఉండగా పేపర్‌లో చూసిన ఓ సంఘటన అతడి జీవితాన్ని మార్చేసింది.

దానిలో ఓ చోట తీవ్రమైన వైకల్యంతో బాధపడుతున్న మహిళ.. ప్రార్థనలు చేస్తున్నట్లుగా పేపర్‌లో వచ్చింది.

ఆమెని చూసి ప్రేరణ పొందిన నిక్‌.. తాను కూడా ప్రేయర్‌ గ్రూప్స్‌లో మాట్లాడటం ప్రారంభించాడు.

అలా నేడు ప్రపంచంలోనే గొప్ప మోటివేషనల్‌ స్పీకర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

నిక్‌ తన 21వ ఏట గ్రిఫిత్‌ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ అందుకున్నాడు.

నిక్‌ బటర్‌ఫ్లై సర్కస్‌ అనే షార్ట్‌ ఫిలింలో నటించాడు. ఈ క్రమంలో 2010లో మెతడ్‌ ఫెస్ట్‌ ఇండిపెండెంట్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బెస్ట్‌ యాక్టర్‌ ఇన్‌ షార్ట్‌ ఫిల్మ్‌ అవార్డు వచ్చింది.

2008లో నిక్‌కి కానే మియహర అనే ఆమెతో పరిచయం ఏర్పడింది.

2012, ఫిబ్రవరి 12న నిక్‌-కానే మియహర వివాహం చేసుకున్నారు.

వీరికి నలుగురు సంతానం. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ప్రస్తుతం నిక్‌ తన కుటుంబంతో కలిసి కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నాడు.

నిక్‌ తొలి పుస్తకం లైఫ్‌ విత్‌ అవుట్‌ లిమిట్స్‌  2010లో విడుదల అ‍య్యింది.

ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా 32 భాషల్లోకి అనువాదం అయ్యింది.