రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో మహిళా డాక్టర్‌ కిడ్నాప్‌ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారం వల్లనే ఈ కిడ్నాప్‌ చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని మిస్టర్‌ టీ వ్యవస్థాపకుడు నవీన్‌ రెడ్డిగా గుర్తించారు పోలీసులు. దాంతో ఈ కిడ్నాప్‌ వ్యవహారంపై ఆసక్తి నెలకొంది.

అసలు నవీన్‌ రెడ్డి, వైశాలిల మధ్య పరిచయం ఎలా ఏర్పడింది.. ఎందుకు విడిపోవాలనుకున్నారు.. మరి నవీన్‌ రెడ్డి ఎందుకు ప్రేమించిన యువతినే కిడ్నాప్‌ చేయాలని భావించాడు.. పోలీసులు అతడిని ఎలా గుర్తించారు వంటి విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ క్రమంలో మిస్టర్‌ టీ నవీన్‌ రెడ్డి గురించి.. అతడి ప్రేమ వ్యవహారం గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివారలు..

నవీన్‌ రెడ్డి మిస్టర్‌ టీ పేరిటి టీ బిజినెస్‌ ప్రారంభించాడు. ఇక్కడ టీ, కాఫీ, మిల్క్‌ షేక్‌లు, స్నాక్స్‌ అన్ని లభిస్తాయి. ఇక కొద్ది రోజుల్లోనే ఈ టీ స్టాల్‌కి ఆదరణ పెరిగింది. ప్రస్తుతం నగరంలో నాలుగు చోట్ల మిస్టర్‌ టీ ఔట్‌లెట్లు ఉన్నాయి. ఈ వ్యాపారం మీద ఆసక్తి ఉన్నవారికి ఫ్రాంచైజీ కూడా ఇస్తారు.

బిజినెస్‌ ప్రాంరభించించిన కొద్ది రోజుల్లోనే అది సక్సెస్‌ అవ్వడం వెనక నవీన్‌ రెడ్డి కృషి, పట్టుదల ఉన్నాయి. ఇక వృత్తిగత జీవితం ఇలా సాగుతుండగా.. ఇక వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. వైశాలితో ప్రేమలో ఉన్నాడు నవీన్‌ రెడ్డి.

కరోనా సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. వైశాలి ప్రతి రోజు టెన్నిస్‌ ఆడేందుకు వెళ్లేది. ఈ క్రమంలోనే ఆమెకు నవీన్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్త స్నేహంగా మారింది.

ఇక వైశాలి తల్లిదండ్రులకు కూడా నవీన్‌ రెడ్డి నచ్చాడు. జీవితంలో సెటిల్‌ అవ్వడమే కాక.. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో.. ఇద్దరికి వివాహం చేయాలని వైశాలి తల్లిదండ్రులు భావించారు. వైశాలి చదువు పూర్తయ్యాక ఇద్దరికి వివాహం చేయాలని నిర్ణయించారు.

ఇక తల్లిదండ్రులు పెళ్లి ఫిక్స్‌ చేయడంతో.. వైశాలి, నవీన్‌ రెడ్డిల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరు సినిమాలు, షికార్లంటూ తిరిగేవారు. తల్లిదండ్రులు కూడా పెళ్లి చేయాలని భావించారు కనుక.. వారికి ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. ఇలా కొన్ని నెలల పాటు ఇద్దరి మధ్య ప్రేమ బంధం కొనసాగింది.

మరి ఇంతలో ఏమయ్యిందో తెలియదు కానీ.. నవీన్‌ రెడ్డితో పెళ్లి తమకు ఇష్టం లేదని చెప్పారు వైశాలి తల్లిదండ్రులు. దాంతో వారిద్దరూ బాధపడ్డారు. కానీ తల్లిదండ్రుల మాట ప్రకారం.. నవీన్‌ రెడ్డితో పెళ్లికి నో చెప్పింది వైశాలి. కానీ నవీన్‌.. ఈ తిరస్కారాన్ని అంగీకరించలేకపోయాడు.

ఎలాగైనా సరే.. వైశాలికి తన ప్రేమను తెలియజేసి.. ఆమెను ఇంప్రెస్‌ చేసి.. మళ్లీ తనను ప్రేమించేలా చేసుకుని.. వివాహం చేసుకోవాలని భావించాడు. అందుకోసం సినిమాటిక్‌ స్టైల్లో.. ఎన్నో ప్రయత్నాలు చేశాడు నవీన్‌ రెడ్డి.

ఇక వైశాలిని ఇంప్రెస్‌ చేసేందుకు.. ఆమె ఇంటి ముందే.. ఓ గ్లాస్‌ హౌస్‌ని నిర్మించుకుని.. అందులో ఉంటూ.. వైశాలి దృష్టిలో పడే ప్రయత్నాలు చేయసాగాడు.

ఇక నవీన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైశాలి కుటుంబసభ్యులు.. అతడిపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. నవీన్‌ రెడ్డి.. తమ కూతురి వెంట పడి.. ఇబ్బందికి గురి చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో పోలీసులు నవీన్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడు తన లవ్‌ స్టోరీ గురించి వారికి చెప్పి.. ఎలాగోలా బయటకు వచ్చాడు.

ఇక గత ఆరు నెలలుగా.. వైశాలిని ఇంప్రెస్‌ చేసే ప్రయత్నంలో ఉన్నాడు నవీన్‌ రెడ్డి. దాంతో విసుగు చెందిన వైశాలి తల్లిదండ్రులు ఇలా అయితే లాభం లేదని భావించి.. ఈ సారి ఏకంగా మెజిస్ట్రేట్‌ ముందు.. నవీన్‌ రెడ్డితో పెళ్లి తనకు ఇష్టం లేదని.. వైశాలి చేత స్టేట్మెంట్‌ ఇప్పించారు. దాంతో నవీన్‌ రెడ్డికి వాళ్ల మీద కోపం పెరిగిపోయింది.

ఇక వైశాలి తల్లిదండ్రులు.. ఆమెకు వివాహ ప్రయత్నాలు మొదలు పెట్టారు. శుక్రవారం ఆమెకు పెళ్లి చూపులు నిర్వహించారు. విషయం తెలిసిన నవీన్‌ రెడ్డి.. విచక్షణ కోల్పోయి.. ఎలాగైనా సరే.. వైశాలిని దక్కించుకోవాలని భావించాడు. దాంతో.. సినిమా స్టైల్లో.. తన వెంట ఓ 100 మందిని వెంటపెట్టుకుని.. వైశాలి వాళ్ల ఇంటికి వెళ్లి.. అక్కడ నానా రచ్చ చేశాడు.

అడ్డుకోబోయే వారి మీద దాడి చేసి.. వైశాలిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకుని.. సొంతం చేసుకోవాలని భావించాడు. అక్కడి వరకు అతడి ప్లాన్‌ సక్సెస్‌ అయ్యింది.

ఇక ప్రియురాలిని పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉండగా.. ఆమె భయంతో.. తన తల్లిదండ్రులను తలుచుకుని ఏడవడం ప్రారంభించింది. ప్రియురాలి ఏడుపు చూసి.. కరిగిపోయిన నవీన్‌ రెడ్డి.. ఆమె తండ్రితో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చి.. కాల్‌ చేసి ఇచ్చాడు.

అదిగో అక్కడే దొరికిపోయాడు. అప్పటికే వైశాలి కిడ్నాప్‌ గురించి తెలుసుకున్న పోలీసులు.. నవీన్‌ రెడ్డి కోసం గాలిస్తున్నారు. ఇంతలో వైశాలి.. తండ్రికి కాల్‌ చేయడంతో.. పోలీసులు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ని ట్రాక్‌ చేసి.. వాళ్లున్న చోటుని కనుక్కుని వెళ్లి.. నవీన్‌ రెడ్డిని అదుపులోకి తీసుకుని.. డాక్టర్‌ వైశాలిని క్షేమంగా ఆమె ఇంటికి చేర్చారు.

ఇక ఈ కిడ్నాప్ చేసింది మిస్టర్ టీ ఫౌండర్ నవీన్ రెడ్డి కావటంతో.. ఈ కిడ్నాప్‌ వ్యవహారంపై ఆసక్తి పెరిగింది. పట్టపగలే.. అందరూ చూస్తుండగా.. సుమారు వంద మంది వచ్చి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి.. ఓ అమ్మాయిని ఎత్తుకెళ్లాటం.. అది కూడా ఓ యువ పారిశ్రామిక వేత్తగా పేరుపొందిన వ్యక్తి చేయటంతో.. ఈ ఘటన కాస్త సంచలనంగా మారింది.

మీడియా వాళ్లంతా అక్కడికి చేరుకోవటంతో.. ఈ విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఆఖరికి ఒక్క ఫోన్‌ కాల్‌తో కథ సమాప్తం అయ్యింది. ప్రస్తుతం నవీన్‌ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నాడు.