తెలుగులో పూర్తి స్థాయి ఘోస్ట్ హర్రర్ సినిమాలు వచ్చి చాలా ఏళ్లయింది.
ప్రేక్షకులు కూడా ఓ మంచి ఫుల్ లెన్త్ ఘోస్ట్ హర్రర్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ‘మసూద’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తెలుగులో చాలా ఏళ్ల తర్వాత వచ్చిన ఈ పుల్ లెన్త్ ఘోస్ట్ హర్రర్ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? అన్నది ఇప్పుడు చూద్దాం.
నీలమ్ (సంగీత), నజియా (భాందవి) తల్లీ కూతుళ్లు. దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వీళ్లు అద్దె ఇంట్లో ఎంతో సంతోషంగా ఉంటారు.
కష్టాలు వచ్చినా అవి మాకు మామూలే అని సర్ధుకుపోతుంటారు. అలాంటి సమయంలో సడెన్‌గా నజియా ప్రవర్తనలో మార్పు వస్తుంది.
దెయ్యం పట్టినట్లు ప్రవర్తిస్తుంటుంది. దీంతో సంగీత పొరుగింట్లో ఉండే గోపి(తిరువీర్) సహాయం కోరుతుంది.
అయితే, గోపి ఓ భయస్తుడు, పిరికివాడు. సంగీతకు సహాయం చేయటానికి మొదట తటపటాయించినా..
ఆ కుటుంబంతో ఉన్న అనుబంధం కొద్దీ సహాయం చేయటం మొదలుపెడతాడు.
ఈ నేపథ్యంలోనే వారికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. నజియాను డాక్టర్లకు చూపిస్తారు.. మంత్రాలను నమ్ముతారు.
కానీ, ఎలాంటి లాభం లేకుండా పోతుంది. రోజు రోజుకు నజియా ప్రవర్తన మరింత దారుణంగా తయారవుతుంది.
ఈ నేపథ్యంలోనే ‘మసూద’ అనే అమ్మాయి గురించి వారికి తెలుస్తుంది. ఎవరా మసూద?
మసూదకు నజియాకు ఉన్న సంబంధం ఏంటి ? మసూద బారినుంచి నజియా బయటపడుతుందా? లేదా? అన్నదే మిగితా కథ.
దర్శకుడు సాయి కిరణ్ సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతం అని చెప్పొచ్చు.
కథ కొత్తదేమీ కాకపోయినా కథనం విషయంలో మాత్రం దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు.
ఓ హర్రర్ సినిమాకు ఉండాల్సిన అన్ని కోణాలు ఈ సినిమాలో ఉన్నాయి. సినిమా చూస్తున్నంత వరకు..
తర్వాత ఏం జరుగుతుందా అని అనిపిస్తూ ఉంటుంది. ఇక, నటీనటులు వారి పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేశారు.
ప్రధాన పాత్రధారులైన సంగీత, తిరువీర్, కావ్య, భాందవి సినిమాకు ఓ బలం అని చెప్పొచ్చు.
దెయ్యం పట్టిన అమ్మాయిగా భాందవి నటన మెప్పించింది.
ఇక, ఆ అమ్మాయిని బాగు పర్చడానికి కష్టాలు పడే పాత్రల్లో సంగీత, తిరువీర్ భయపడుతూనే మనల్ని భయపెడతారు.
ఇక, పాత్రను ముందుకు తీసుకెళ్లే పాత్రల్లో నటించిన సుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్, సత్య ప్రకాశ్, అఖిలా రామ్ తదితరులు వారి పాత్రలకు న్యాయం చేశారు.
సాధారణంగా ఓ హర్రర్ సినిమాకు సౌండ్, విజువల్స్ ప్రధానం. సంగీత దర్శకుడు ప్రకాశ్ ఆర్ విహారి అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు.
సీన్, షాట్‌కు తగినట్లు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశారు.
ఆ తర్వాత కెమెరా పనితనం కూడా సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లింది.
నాగేష్ తన పనితనంతో సినిమాను మరింత భయంకరంగా తీర్చిదిద్దారు. సినిమా ఎడిటింగ్‌లో జెస్మిన్ ప్రభు పనితన కనిపిస్తుంది.
ఫ్లస్‌లు : కథ కథనం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ
మైనప్ పాయింట్స్ : స్లో నరేషన్
చివరి మాట : ‘మసూద’ మిమ్మల్ని తప్పక భయపెడుతుంది
రేటింగ్ : 3/5
(గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)