మహా శివరాత్రి అంటే ఉపవాసం, జాగరణ ఉంటారు.
ఉపవాసం ఉండడం అనేది అందరికీ సాధ్యపడే విషయం కాదు.
పని నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఉపవాసం ఉండడం అనేది కష్టమే.
కొంతమంది ఉంటారు. కానీ అందరూ ఉండలేరు. వయసులో బాగా పెద్దవారికి కూడా ఇబ్బందే.
కానీ ఉపవాసం ఉంటే శివానుగ్రహం ఉంటుందని నమ్మేవారు ఈ ఒక్క పని చేసినా ఉపవాసం చేసిన దానికంటే ఎక్కువ ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
ఉపవాసం అంటే కేవలం ఆహార ఉపవాసం మాత్రమే కాదు. నోటి ఉపవాసం కూడా.
ఆహార ఉపవాసం అంటే ఆహారాన్ని నిషేధించడం. నోటి ఉపవాసం అంటే మాటలను నిషేధించడం.
మాటే కదా అని అనుకోకండి. ఆ మాట వల్లే ఎంతోమంది ప్రశాంతత కోల్పోతున్నారు.
రోజుల తరబడి మాట్లాడకుండా ఉండడం ఎవరి వల్లా కాదు. కానీ శివరాత్రి రోజున నోటితో ఉపవాసం చేస్తే శివానుగ్రహం దక్కుతుంది.
నోటి ఉపవాసం ఉండడం వల్ల పక్కవారితో మాట్లాడకుండా పూజ గదిలో కూర్చుని మనసులో పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి.
ఓం నమఃశ్శివాయ అని స్మరించుకుంటే ఆ శివుని అనుగ్రహం ఉంటుంది.
ఉపవాసం అంటే కేవలం కడుపుకి మాత్రమే కాదు, నోటికి కూడా ఉండాలని చెబుతారు పెద్దలు.
ఉపవాసం చేయడం వల్ల ఆరోజు జీర్ణవ్యవస్థకు విరామం ఇచ్చినట్టే కాకుండా.. కడుపు తేలిగ్గా ఉంటుంది.
అలానే నోటి ఉపవాసం వల్ల కూడా మనసు తేలిగ్గా ఉంటుంది. దుర్భాషలాడడం, తిట్టడం, వాగ్వాదం పెట్టుకోవడం వంటి వాటి వల్ల ప్రశాంతత కోల్పోతారు.
అందుకే నోటి ఉపవాసం ఉండి ఆ పరమేశ్వరుడిని స్మరించుకుంటూ కూర్చుంటే ఉపవాసం ఉన్న దాని కంటే కూడా ఎక్కువ ఫలితం వస్తుందని అంటున్నారు.
ఋషులు, మునులు మాట్లాడకుండా తపస్సు చేయడం వల్ల దైవానుగ్రహం పొందారు. వారిలా ఏళ్ల తరబడి కాకపోయినా శివరాత్రి రోజున మౌనం వహిస్తే మంచి జరుగుతుందని అంటున్నారు.