ఇటీవల చిన్నా పెద్దా అనే తేడా లేకుండా గుండె పోటుకు బలౌతున్నారు. రెప్పపాటులో ఈ మరణాలు చోటుచేసుకుంటున్నాయి.
అప్పటి వరకు మనకు కనిపించిన వారు.. కొద్ది సేపట్లోనే హార్ట్ స్ట్రోక్‌తో చనిపోతున్నారు.
ఎంతో భవితవ్యాన్ని చూడాల్సిన చిన్న పిల్లలు సైతం కాని రాని లోకాలకు వెళ్లిపోతూ.. కుటుంబాలను శోక సంద్రంలో ముంచెత్తుతున్నారు.
ఇటీవల కాలంలో తెలంగాణలోనే చాలా మంది హార్ట్ స్ట్రోక్‌కు గురై అకాల మరణం చెందారు.
కాలేజ్‌కు వెళుతూ ఓ ఇంజనీరింగ్ విద్యార్థి, జిమ్‌కు వెళ్లి యువ పోలీస్, సినిమా చూస్తూ సాఫ్ట్ వేర్ మరణించిన సంగతి విదితమే. వీరంతా యువకులే.
తాజాగా మరో చిన్నారి గుండె పోటుతో మృతి చెందింది. అప్పటి వరకు స్నేహితులతో ఆడిపాడిన బాలిక.. కొన్ని గంటలకే గుండె పోటుతో కుప్పకూలిపోయింది.
13 ఏళ్లకే ఓ బాలిక తనువు చాలించింది. ఈ హృదయ విదారకమైన ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో జరిగింది.
అబ్బాయి పాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని బోడ తండాలో నివసిస్తోంది బోడ లకపతి, వసంత కుటుంబం. వీరికి ఇద్దరు సంతానం. వీరిది వ్యవసాయ ఆధారిత కుటుంబం
ఈ దంపతుల కుమార్తె బోడ స్రవంతి (13) స్థానికంగా ఉన్న ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతుంది.
శ్రీరామనవమి సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో గురువారం సాయంత్రం వరకు గ్రామంలో ఉన్న స్నేహితులతో ఆడుకుంది.
అలిసిపోయి ఇంటికి వచ్చిన స్రవంతి.. నాన్నమ్మ దగ్గర నిద్రపోయింది.
శుక్రవారం తెల్లవారు జామున శ్వాస ఆడకపోవడంతో తన ప్రక్కనే ఉన్న నాన్నమ్మను లేపింది.
ఆమె తేరుకునేంతలోనే.. స్రవంతి గుండె పోటుతో కుప్పకూలిపోయింది.
బాలిక పడిపోవడంతో.. అక్కడే ఉన్న బాబాయి వచ్చి సీఆర్పీ చేసి.. సమీపంలోని ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు హుటాహుటిన తీసుకెళ్లారు.
అయితే అప్పటికే బాలిక గుండె పోటుతో చనిపోయిందని వైద్యుడు చెప్పాడు. దీంతో స్రవంతి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
తమతో అప్పటి వరకు ఆడిపాడిన చిన్నారి ఇక లేదని బంధువులు విలపించారు. తండాలోని ప్రజలు సైతం భోరుమన్నారు.