ఖుష్బు.. ఈ పేరు తెలియని వారుండరు. దక్షిణాది సినిమాల్లో నటించి మెప్పించారు.
1986లో కలియుగ పాండవులతో తెలుగు పరిశ్రమలోకి వచ్చిన ఆమె.. 1990 దశకంలో అగ్ర నటీమణిగా వెలుగొందారు.
ఆమె నటనను మెచ్చిన కోలీవుడ్ అభిమానులు గుండెల్లోనే కాదూ.. నిజంగానే ఆమెకు గుడి కట్టి దేవతగా పూజించారు.
ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇటీవల బీజెపీలో చేరిన ఆమె.. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.
అయితే తన తండ్రి తనను లైంగికంగా వేధించాడని సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
1991లో చిన్న తంబి సినిమాలో షూటింగ్ సమయంలో నటుడు ప్రభుతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు ఖుష్బు.
1993లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే ప్రభుకి వివాహం కాగా, ఆయన తండ్రి, ప్రముఖ నటుడు శివాజీ గణేషన్ వీరి పెళ్లిని అంగీకరించలేదు.
దీంతో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. నాలుగు నెలలకే వీరు విడిపోగా.. 2000వ సంవత్సరంలో దర్శకుడు సి.సుందర్‌ను వివాహం చేసుకున్నారు ఖుష్బు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు.
అయితే ఇప్పుడు ఖుష్బు తాజాగా చేసిన ఓ పోస్టు వైరల్‌గా మారింది. మాజీ భర్త, నటుడు ప్రభుతో దిగిన ఫోటోను ఆమె నెట్టింట్లో షేర్ చేసింది.
చిన్న తంబి సినిమా విడుదలై ఏప్రిల్ 12తో 32 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఖుష్బు ఎమోషనల్ పోస్టు చేశారు.
చిన్నతంబి సినిమా చేసి అప్పుడే 32 ఏళ్లు అయిందంటే అసలు నమ్మలేకపోతున్నా. నాపై కురిపించిన ప్రేమకు ఎప్పుడూ మీ అందరికీ రుణపడి ఉంటా.
దర్శకుడు వాసు, ప్రభు కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటుంది. మనసులను కదిలించే సంగీతాన్ని అందించిన ఇళయరాజా సర్‌కు.. అలాగే కె.బాలుకి ఎప్పటికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
నందిని (సినిమాలో ఖుష్బు పేరు) ప్రతి ఒక్కరి హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయింది. మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు అని ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.
వాసు, ప్రభుతో దిగిన ఫోటోను షేర్ చేసుకున్నారు. దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు ఆమెకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.