ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ గౌరవ ఛైర్మన్ కేశుబ్ మహీంద్రా కన్నుమూశారు.

కేశుబ్ మరణవార్తను ఎంఅండ్ఎం మాజీ ఎండీ పవన్ గోయెంకా ధృవీకరించారు. కంపెనీ అధికార ప్రతినిధి కూడా దీనిపై ఓ ప్రకటనను రిలీజ్ చేశారు. 

1963 నుంచి 2012 వరకు అంటే దాదాపు అర శతాబ్దం మహీంద్రా గ్రూప్​కు ఛైర్మన్​గా వ్యవహరించారు కేశుబ్. 

రీసెంట్​గా వెలువడిన ఫోర్బ్స్ కుబేరుల లిస్టులో 1.2 బిలియన్ డాలర్ల సంపదతో ఇండియాలో అత్యంత వృద్ధ బిలియనీర్​గా కేశుబ్ నిలిచారు. 

1947లో మహీంద్రా గ్రూప్​లోకి కేశుబ్ ఎంట్రీ ఇచ్చే నాటికి ఆ సంస్థ విల్లీస్ జీప్​లను తయారు చేస్తుండేది. 

విల్లీస్ జీప్​లను తయారు చేసే కంపెనీని కేశుబ్ అనేక రంగాలకు విస్తరించారు.

కేశుబ్ దూరాలోచన, ముందుచూపు, దార్శనికతతో మహీంద్రా గ్రూపును విస్తరించారు. 

ఇప్పుడు మహీంద్రా గ్రూప్ వాహన, ఇంధనం, సాఫ్ట్​వేర్ సేవలు, స్థిరాస్తి, ఆతిథ్యం, రక్షణ.. ఇలా ఎన్నో రంగాలకు విస్తరించింది. 

కేషుబ్ పదవీ విరమణ అనంతరం ఆయన వారసుడిగా మేనల్లుడు ఆనంద్ మహీంద్రా.. మహీంద్రా సంస్థ ఛైర్మన్​గా సెలెక్ట్ అయ్యారు. 

మేనమామ కేషుబ్​లాగే ఆనంద్ మహీంద్రా కూడా మహీంద్రా గ్రూపును విజయవంతంగా నడిపిస్తున్నారు. 

దేశంలోని ప్రముఖ సంస్థల్లో మహీంద్రా గ్రూప్ ఒకటిగా నిలిచింది. 

కేషుబ్ మహీంద్రా మరణంపై వ్యాపార వర్గాలు సంతాపం ప్రకటించాయి. 

పారిశ్రామిక ప్రపంచం అత్యంత ఉన్నతమైన వ్యక్తిని కోల్పోయిందని పవన్ గోయెంకా తెలిపారు.