గత కొన్నాళ్లలో కన్నడ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ 'KGF'

దాని తర్వాత అలాంటి హైప్ క్రియేట్ చేసి, 'కేజీఎఫ్'లా ఉండొచ్చు అనిపించిన మూవీ 'కబ్జ'.

రియల్ స్టార్ ఉపేంద్ర ఇందులో హీరో కావడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

కొన్నాళ్ల ముందు రిలీజైన ట్రైలర్ కూడా నెక్స్ లెవల్ ఉండేసరికి థియేటర్లకు వెళ్లాల్సిందేనని చాలామంది ఫిక్సయిపోయారు. 

'కేజీఎఫ్', 'కాంతార', 'చార్లి 777' తర్వాత కన్నడ నుంచి వస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో తెగ వెయిట్ చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా థియేటర్లలోకి వచ్చిన 'కబ్జ' మూవీ ఎలా ఉంది? టాక్ ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.

కథ: సిటీకి కొత్త కమీషనర్ గా అపాయింట్ అయిన భార్గవ్ భక్షి.. గుండాలు అందరినీ పిలిచి మీటింగ్ పెడతాడు.

తను మూములోడిని కాదని సదరు రౌడీలని బెదిరించి మరీ చెప్తాడు. మాటల మధ్యలో ఆర్కేశ్వర్(ఉపేంద్ర) స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు.

ఉత్తర భారతదేశానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు అమరేశ్వర్ కు ఇద్దరు పిల్లలు. అందులో ఒకడే ఆర్కేశ్వర్.

చిన్నప్పడే తండ్రి చనిపోవడంతో.. దక్షిణ భారతదేశంలోని అమరాపురానికి ఆర్కేశ్వర్ కుటుంబం వలస వస్తుంది.

భయస్థుడైన ఆర్కేశ్వర్.. పెద్దయిన తర్వాత ఎయిర్ ఫోర్స్ లో జాబ్ సంపాదిస్తాడు. సెలవుపై ఓసారి ఊరికి వస్తాడు.

అప్పుడు జరిగిన ఓ సంఘటన వల్ల కొందరిని చంపేస్తాడు? అనుకోకుండా పెద్ద డాన్ అయిపోతాడు.

ఆర్కేశ్వర్ అసలు రౌడీగా ఎందుకు మారాల్సి వచ్చింది? ఈ స్టోరీలో మధుమతి(శ్రియ) పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్ కి వెళ్లాల్సిందే.

విశ్లేషణ: 'పులిని చూసి నక్క వాతపెట్టుకోవడం' అని ఓ సామెత ఉంటుంది. 'కబ్జ' విషయంలో అదే జరిగిందా అనిపిస్తుంది.

ఎందుకంటే 'కేజీఎఫ్' సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో దాదాపు అలానే తీసేయాలని దర్శకుడు అనుకున్నట్లు ఉన్నాడు.

మ్యూజిక్, సినిమాటోగ్రఫీ దాదాపు అలానే ఉండేలా చూసుకున్నాడు. కానీ ఎమోషన్ అనే అసలు విషయాన్ని మాత్రం పక్కనబెట్టేశారు.

సుదీప్ ఇంట్రాడక్షన్, వెంటనే ఫ్లాష్ బ్యాక్, ఉపేంద్ర ఎంట్రీ, శ్రియ ఎంట్రీ.. ఇలా సీన్లన్నీ కూడా సంబంధం లేకుండా పరుగెడుతుంటాయి.

పోనీ స్టోరీలో ఏమైనా కొత్తదనం ఉందా అంటే అదీ లేదు. గొడవలంటే ఇష్టం లేని ఓ వ్యక్తి డాన్ గా మారడం అనే కాన్సెప్ట్ ని ఇప్పటికే చాలా చిత్రాల్లో చూశాం.

రెండు గంటల 16 నిమిషాల పాటు ఉండే 'కబ్జ' సినిమాలో ఏ సీన్ కూడా మనకు కనెక్ట్ కాదు. పోనీ యాక్షన్ తో గూస్ బంప్స్ తెప్పిస్తారా అంటే అదీ ఉండదు.

ఇక క్లైమాక్స్ అయితే మరీ ఘోరంగా ఉంటుంది. మంచి యాక్షన్ సీన్ ఉంటుంది కదా అనుకుంటాం. అలాంటి టైంలో మనం తిట్టుకునేలా ఎండ్ చేస్తారు.

ఇక వీఎఫ్ఎక్స్ అయితే మరీ దారుణంగా ఉంటుంది. ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చాలా చోట్ల ఈజీగా తెలిసిపోతుంది.

మేకింగ్ లో 'కేజీఎఫ్'ని ఫాలో అయిపోతే సరిపోదు. స్టోరీలో దమ్ముండాలి. అప్పుడే వర్కౌట్ అవుతుంది. లేదంటే బకెట్ తన్నేస్తుంది. 'కబ్జ'కి అదే జరిగింది.

నటీనటులు & టెక్నికల్ టీమ్ పనితీరు: ఉపేంద్ర చాలా గొప్ప యాక్టర్. మనలో చాలామందికి అది తెలుసు. 'కబ్జ'లో మాత్రం కోపం, బాధ తప్ప వేరేవి పలికించే ఛాన్స్ రాలేదు.

మిగతా నటీనటులు ఉన్నారంటే ఉన్నారు అంతే. కొందరు యాక్టర్స్.. కొన్ని సీన్లలో మరీ ఓవరాక్షన్ చేశారనిపిస్తుంది. శ్రియకి నటించే స్కోప్ పెద్దగా దొరకలేదు.

ఇక మ్యూజిక్ అందించిన రవి బస్రూర్, సినిమాటోగ్రఫర్ అర్జున్ శెట్టి.. తమ బెస్ట్ ఇచ్చారు. మిగతా అందరూ చేతులెత్తేసినా సరే వీళ్లు మాత్రం చాలా ప్లస్ అయ్యారు.

డైరెక్టర్ R.చంద్రుకి అద్భుతమైన నటీనటులు దొరికినా సరే, సినిమాని తీసే విషయంలో ఫెయిలవడంతో వాళ్లందరి కష్టం వృథా అయిందా అనిపించింది.

ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని క్లైమాక్స్ లో చెప్పారు. అందులో పునీత్ అన్న శివరాజ్ కుమార్ హీరోగా కనిపిస్తారు. చూడాలి మరి అదెప్పుడు వస్తుందో?

ప్లస్ పాయింట్స్ ఉపేంద్ర యాక్టింగ్ సినిమాటోగ్రఫీ మ్యూజిక్

మైనస్ పాయింట్స్ చాలా బోరింగ్ సీన్స్ కొందరు యాక్టర్స్ ఓవరాక్షన్ చాలాచోట్ల 'కేజీఎఫ్'తో పోలిక

చివరగా: 'కబ్జ'లో స్టోరీ తక్కువ, సౌండ్ ఎక్కువ!

రేటింగ్: 1.5

(గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)