ఏ దేశమైనా శత్రు దేశాలతో ఎదురయ్యే దాడులను తిప్పికొట్టేందుకు మూడు మార్గాల్లో తన బలాన్ని పెంచుకుంటుంది.

భూమి, ఆకాశంతో పాటు సముద్రంలోనూ రక్షణ బలాన్ని పెంచుకోవడంపై ఇప్పుడన్నీ దేశాలూ దృష్టి పెడుతున్నాయి.  

భారత్ కూడా నావికాదళ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. 

హిందూ మహాసముద్రంలో చైనా ఉనికిని పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో నేవీ బలాన్ని మరింతగా పెంచుకోవడం భారత్ దృష్టి పెట్టింది.

ఇందులో భాగంగా కొత్తగా మరో జలాంతర్గామిని నేవీలోకి ప్రవేశపెట్టింది. 

ఐఎన్ఎస్ వాగీర్ అనే సబ్‌మెరైన్ భారత్ నావికాదళంలో కొత్తగా చేరింది. ఇందుకు ముంబైలోని నావల్ డాక్ యార్డ్ వేదికైంది.

వాగీర్‌ను నావికా దళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ లాంఛనంగా ఇండియన్ నేవీలోకి ప్రవేశపెట్టారు.

అత్యాధునిక ఆయుధ వ్యవస్థ, వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం వాగీర్ సొంతం. గుట్టుగా మోహరిస్తూ శత్రువులకు గుబులు పుట్టించగలదీ సబ్‌మెరైన్. 

ప్రాజెక్ట్ 75 కింద రూపొందిన వాగీర్‌ను మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ సంస్థ తయారు చేసింది. దీని తయారీలో ఫ్రాన్స్ నుంచి బదిలీ చేసిన సాంకేతికతను వినియోగించారు. 

వాగీర్ అనే సొర చేప స్ఫూర్తితో కొత్త సబ్‌మెరైన్‌కు ఈ పేరు పెట్టామని భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ తెలిపారు. 

కొత్త సాంకేతికతతో రూపొందిన వాగీర్ నీళ్ల లోపల గంటకు 40 కిలో మీటర్లు, నీటి మీద గంటకు 20 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. 

తయారీ పూర్తయిన తర్వాత దాదాపు 11 నెలల పాటు సముద్రంలో ఎన్నో ట్రయల్స్‌ను వాగీర్ ఎదుర్కొంది. అవన్నీ విజయవంతంగా పూర్తి చేయడంతో దీన్ని నేవీలోకి తీసుకున్నారు.

వైర్ గేటెడ్ టార్పెడోలు, పాక్షిక ఉపరితలం నుంచి ప్రయోగించే క్షిపణులు వాగీర్ అమ్ములపొదిలో ఉన్నాయి.

అత్యంత శక్తిమంతమైన డీజిల్ ఇంజిన్లు, అత్యాధునిక సెన్సార్‌లు, టార్పెడో డెకాయ్, సోనార్ లాంటి వ్యవస్థలతో రూపొందిన వాగీర్.. భారత నేవీ రక్షణలో ప్రధాన బలంగా నిపుణులు చెబుతున్నారు. 

ప్రాజెక్ట్-75లో భాగంగా కల్వరీ శ్రేణికి చెందిన వాగీర్ సబ్‌మెరైన్‌ను స్కార్పీన్ డిజైన్‌తో తయారు చేయడం విశేషం.