అవును మీరు చదివింది నిజమే. భర్తల చేతిలో మోసపోయిన మహిళలకు రూ. 2.45 లక్షల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది.
అమ్మాయికి పెళ్లి అంటే అమెరికా సంబంధమే అనేలా జనాలు ప్రభావితమైపోయారు.
అబ్బాయికి డబ్బు, మంచి జీతం, అమెరికా జీవితం ఇవి ఉంటే చాలు.
కేరెక్టర్ ఎలా ఉన్నా అవసరం లేదు. అమ్మాయిని అమెరికాలో స్థిరపడ్డ అబ్బాయికిచ్చి పెళ్లి చేసి పంపించేస్తారు.
పెళ్ళికి ముందు మంచిగా నటించిన భర్తలు కొంతమంది పెళ్లయ్యాక అసలు స్వరూపాన్ని బయట పెడతారు.
భార్యలను అదనపు కట్నం కోసం హింసించడం, వేధించడం, విడాకులు ఇచ్చేయడం, వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని మోసం చేయడం వంటివి చేస్తుంటారు.
ఇలాంటి పరిస్థితుల్లో భార్యలు న్యాయ పరంగా పోరాడేందుకు కావాల్సిన ప్రోత్సాహాన్ని, ఆర్థిక భరోసాని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది.
విదేశీ భర్త లేదా ఎన్ఆర్ఐ చేతిలో మోసపోయిన మహిళలు దేశం కాని దేశంలో.. ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మానసిక వేదనకు గురవుతారు.
పరాయి దేశంలో భర్త మోసం చేసి పోతే న్యాయపోరాటానికి దిగుదామన్నా డబ్బు ఉండదు. ఇలాంటి వారి కోసమే ఈ పథకం.
మోసం చేసిన భర్తలపై న్యాయ పోరాటం చేయడానికి, పరిహారం పొందడానికి 2000 డాలర్ల నుంచి 3000 డాలర్ల వరకూ ఆర్థిక సహాయం అందజేస్తుంది.
భారత కరెన్సీ ప్రకారం రూ. 1.63 లక్షల నుంచి రూ. 2.45 లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తుంది.
తమ భర్తల నుంచి విడాకులు లేదా భరణం లేదా ఆస్తి హక్కులు పొందడం కోసం మహిళలు విదేశీ కోర్టుల్లో పోరాటం చేయాల్సి ఉంటుంది.
దీని కోసం అక్కడ అడ్వకేట్ కి ఫీజు, కోర్టు ఫీజులు వంటివి ఇలా చాలా వ్యయ ప్రయాసలు పడాల్సి ఉంటుంది.
ఇది భరించే శక్తి లేని మహిళలకు రూ. 2.45 లక్షల వరకూ న్యాయ పోరాటం చేసేందుకు ఆర్థిక సహాయం అందజేస్తుంది భారత ప్రభుత్వం.
అంతేకాదు మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు మహిళలకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చి భరోసా కల్పిస్తుంది.
విదేశాల్లో ఉన్న ఎన్నారైలను గానీ విదేశీయులను గానీ వివాహం చేసుకున్న భారతీయ మహిళల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.