టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం అతడు ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొన్ని రోజుల క్రితం పంత్ మోకాలికి విజయవంతంగా సర్జరీ జరిగింది.

ఇక ప్రస్తుతం టీమిండియా మరో వన్డే మిగిలి ఉండగానే న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ గెలిచి మంచి జోరుమీదుంది.

ఈ క్రమంలోనే నామమాత్రపు మూడో వన్డే కోసం మధ్యప్రదేశ్ చేరుకున్నాయి ఇరు జట్లు. 

ఈ నేపథ్యంలోనే పంత్ త్వరగా కోలుకోవాలని పూజలు నిర్వహించారు టీమిండియా ఆటగాళ్లు.

మధ్యప్రదేశ్ లోని ప్రముఖ ఆలయం అయిన ఉజ్జయినీ మహాకాళేశ్వర్ దేవాలయంలో పంత్ త్వరగా కోలుకోవాలని పూజలు చేశారు.

ఈ పూజలు చేసిన వారిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లు ఉన్నారు. పూజలు చేస్తున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడాడు సూర్యకుమార్. పంత్ త్వరగా కోలుకొని జట్టులోకి రావాలనే ఈ పూజలు చేసినట్లు తెలిపాడు.

వచ్చే టోర్నీలు టీమిండియాకు కీలకం కావడంతో పంత్ వీలైనంత త్వరగా జట్టులోకి చేరాలని అందరు కోరుకుంటున్నారని సూర్య చెప్పాడు.

కివీస్ పై ఇప్పటికే వన్డే సిరీస్ గెలిచినప్పటికీ.. మూడో వన్డేలో కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

పూజా కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత ఆలయ సిబ్బంది టీమిండియా ఆటగాళ్లకు అన్నప్రసాదాలు ఇచ్చారు.