దొంగలు అందిన కాడికి దోచుకుంటున్నారు. గుండు సూదీ నుండి ఏ వస్తువును వదిలిపెట్టడం లేదు.

డబ్బు, బంగారు వస్తువులతో పాటు ఖరీదైన వస్తువులు, అలాగే కారు, లారీ వంటి వాహనాలు దోచుకెళ్లిన ఘటనలు అనేకం ఉన్నాయి.

దొంగల్లో బీహార్ దొంగలు తీరే వేరయా అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే.. 

చిన్న వస్తువులే కాదూ.. గతంలో రైలు పట్టాలు,  ఇంజను, బ్రిడ్జీని కూడా మాయం చేశారు. తాజాగా మరో వింత దొంగతనానికి పాల్పడ్డారు. ఇంతకు అదేమిటంటే..?

మామూలుగా మొబైల్ దొంగతనం చూసుకుంటాం కానీ మొబైల్ టవర్‌నే ఎత్తుకెళ్లడం గురించి విన్నారా? ఆ అంత ఎత్తు, బరువు ఉంటుంది అదెలా దొంగిలిస్తారండీ అని అనుకుంటున్నారా

అయితే అదీ కూడా దొంగతనం చేయొచ్చు అని నిరూపించారు బీహార్ దొంగలు. ఏకంగా సెల్ టవర్‌నే లేపేశారు. 

ఈ దొంగతనం ఎలా జరిగిందో తెలియక.. ఆ సెల్ కంపెనీ, దాన్ని ఉంచిన భూ యజమాని అవాక్కు అయ్యారు.

ఈ ఘటన బీహార్‌లోని ముజఫర్ పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. అదీ కూడా పట్ట పగలే ఈ దోపిడీకి పాల్పడ్డారట.

శ్రమజీవి నగర్‌లో మనీషా కుమారి ఇంట్లో జీటీఏఎల్ కంపెనీ మొబైల్ టవర్‌ను గతంలో ఏర్పాటు చేశారు. 

ఈ పాత బడిన సెల్ టవర్ వద్దకు వచ్చిన దొంగలు..దర్జాగా సెల్ టవర్‪ను దొంగిలించారు.

జనరేటర్ సెట్, షెల్టర్, స్టెబిలైజర్‌ను కూడా మాయం చేశారు. వారు వెంట తెచ్చుకున్న వాహనంలో దోచినదంతా వేసుకుని తుర్రుమన్నారు.

కొన్ని రోజుల తర్వాత టవర్ పనుల నిమిత్తం వచ్చిన అధికారులు అక్కడకు వెళ్లగా.. అది కనిపించలేదు. 

అక్కడి వారందరినీ అడగ్గా..మొన్ననే కదా మీ కంపెనీ వాళ్లు వచ్చి తీసుకెళ్లారు అని చెప్పడంతో గుడ్లు తేలేశారట వాళ్లు.

నెల క్రితం వచ్చి మొబైల్ టవర్ పనిచేయడం లేదని, అందుకే దాన్ని తొలగిస్తున్నామని ఆ టవర్ ఉంచిన భూ యజమాని మనీషా కుమారి పోలీసులకు చెప్పారు. 

ముజఫర్‌పూర్ పోలీసులకు ఈ దొంగతనం సవాల్‌గా మారింది. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి.. సీరియస్‌గా దర్యాప్తు ప్రారంభించారు.