మిగతా సమయాల్లో ఎలా ఉన్నా సరే.. కానీ గర్భం దాల్చిన తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
మరీ ముఖ్యంగా ఆహారం విషయంలో మరింత జాగ్రత్త అవసరం.
మిగతా సమయాల్లో మాదిరి ఏది పడితే అది తినలేం.. తినకూడదు కూడా.
దాని ప్రభావం తల్లి, బిడ్డల మీద ఉంటుంది. అందుకే ఆహారంలో విషయంలో తగిన జాగ్రత్త అవసరం.
గర్భధారణ సమయంలో నీరు, జ్యూస్‌లు ఎక్కువగా తాగాలి.
నీరు ప్లాసెంటా , ఉమ్మనీరు ఏర్పడటానికి సహాయపడుతుంది. ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది.
గర్భిణీ స్త్రీలు ప్రతిరోజూ 8-12 గ్లాసుల నీరు, ద్రవపదార్థాలను తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తారు.
కానీ కొన్ని ఆహారాలు, పానీయాలు అతిగా తీసుకోకూడదు. ఎందుకంటే అవి శరీరంలో అసమతుల్యతను కలిగిస్తాయి, శిశువుకు హాని కలిగిస్తాయి.
ఇలా గర్భధారణ సమయంలో తీసుకోకూడని పదార్థాలలో గ్రీన్ టీ ఒకటి.
సాధారణంగా గ్రీన్ టీ చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది.
కానీ ప్రెగ్నెన్సీ సమయంలో గ్రీన్ టీని అతిగా తీసుకుంటే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు వైద్యులు.
గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ అని పిలువబడే యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి
ఇవి ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి.
దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికి.. ఇది కెఫిన్‌ను కలిగి ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం.
గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల గర్భస్రావం, నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడం, అధిక మూత్ర విసర్జన, బరువు తగ్గడం, ప్రసవ సమయంలో ఇబ్బంది తలెత్తడం వంటి సమస్యలు వస్తాయి.
కనుక ప్రెగ్నెన్సీ సమయంలో గ్రీన్ టీని అధికంగా తీసుకోకూడదు అంటున్నారు వైద్యులు.