వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు మానవ జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.

ప్రధానంగా ఉరుములు, మెరుపులతో పాటు వచ్చిపడుతున్న పిడుగులు ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడు తున్నాయి.

ఈ క్రమంలో పిడుగుబాటుకు గురై పలువురు మృత్యువాత పడుతుండగా, పలుచోట్ల మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి.

ఈ నేపథ్యంలో పిడుగుల బారి నుండి ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం..

ఉరుములు, మెరుపులు వస్తున్నప్పుడు ఇంట్లో ఉంటే బయటకు రాకపోవడమే మంచిదే.

కార్లలో ప్రయాణిస్తున్నా లేదా కార్లో కూర్చొని ఉన్నా అందులోనే ఉండటం ఉత్తమం.

ఉరుములు, మెరుపుల శబ్దాలు వస్తున్నప్పుడు పొడవైన, ఒంటరిగా ఉన్న చెట్ల కింద ఉండకూడదు.

ఈ సమయాల్లో పొలాల్లో పనిచేసే రైతులు వెంటనే ఇళ్లకు లేదా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి.

భూమి మీద అరికాళ్లు పూర్తిగా పెట్టకుండా వేళ్ల మీద కూర్చోవాలి లేదా నిల్చోవాలి.

ఒకవేళ బావులు,  చెరువులు లేదా నీటిలో ఉన్నట్టయితే సాధ్యమైనంత త్వరగా బయటకు వచ్చేయాలి.

ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్‌ స్తంభాలకు దూరంగా ఉండండి.

సెల్‌ఫోన్‌, ఎఫ్‌ఎం రేడియో వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించకండి.

పైన చెప్పినట్లుగా తలదాచుకునేందుకు ఆశ్రయం లేనప్పుడు.. మోకాళ్లపై చేతులు, తల పెట్టి దగ్గరగా ముడుచుకొని కూర్చోండి.

దగ్గరగా ముడుచుకొని కూర్చుంటే పిడుగు పడినప్పుడు వెలువడే విద్యుత్ ప్రభావం మీపై తక్కువగా ఉంటుంది.

అలాగే ఇళ్లలో టీవీలు, రిఫ్రిజిరేటర్లను ఆపేయాలి. లేదంటే పిడుగు పడినప్పుడు విద్యుత్ తీగల ద్వారా హై వోల్టేజీ ప్రవహించడంతో అవి కాలిపోయే ప్రమాదం ఉంటుంది.