బంగారం అంటే భారతీయులకు మరీ ముఖ్యంగా మహిళలకు ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

వివాహాలు, పండుగలు, శుభకార్యాలు.. ఇలా సందర్భం వచ్చిన ప్రతి సారి మహిళలు అంతో ఇంతో బంగారం కొనడానికి ప్రయత్నిస్తారు.

భారతీయ మహిళల దృష్టిలో బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అవసరానికి అక్కరకు వచ్చే ఆదాయం కూడా.

అందుకే చేతిలో కాస్త పెద్ద మొత్తం డబ్బులు ఉంటే.. బంగారం కొనడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

అయితే గత కొంత కాలంగా బంగారం ధర చుక్కలను తాకుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఆల్‌ టైం గరిష్ట స్థాయికి చేరుకుంది.

అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా బంగారం ధరలో హెచ్చు తగ్గులు వస్తాయి.

ఇక మన దేశంలో కూడా అన్ని నగరాల్లో బంగారం ధర ఒకేలా ఉండదు.

అలానే హైదారాబద్‌లో కూడా కొన్ని ప్రాంతాల్లో బంగారం తక్కువ ధరకే లభిస్తుంది.

బంగారు ఆభరణాల కొనుగోళ్లలో హైదరాబాద్‌ ముందు వరుసలో ఉంటుంది.

ఇక రాజుల కాలం నుంచి కూడా హైదరాబాద్‌ నగరం బంగారు ఆభరణాలకు ప్రసిద్ధి చెందింది.

ఇక్కడ తయారు చేసే నగలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

నిజాం కాలం నుంచి కూడా హైదరాబాద్‌ స్వర్ణకారులకు మంచి పేరుంది.

ఒకప్పుడు ఢిల్లీ రాజులు సైతం హైదరాబాద్‌ స్వర్ణకారులను పిలిపించుకుని.. నగలు తయారు చేయించుకునేవారు.

అలా గత 150 సంవత్సరాలుగా హైదరాబాద్‌లో నమ్మకంగా బంగారం వ్యాపారం చేస్తున్న దుకాణాలు అనేకం ఉన్నాయి.

నాణ్యతకు, మన్నికకు, అద్భుతమైన డిజైన్లకు ఈ షాపులు పెట్టింది పేరు.

పైగా పెద్ద పెద్ద జ్యువేలరీ స్టోర్స్‌తో పోల్చితే  ఇక్కడ ధర కూడా తక్కువగానే ఉంటుంది.

కారణం వీరు మజూరీ, వ్యాట్‌, వేస్టేజ్‌ వంటి తదితర అంశాల్లో.. జ్యువేలరీ స్టోర్స్‌తో పోల్చితే.. తక్కువ ఛార్జ్‌ చేస్తారు.

మరి ఏ ప్రాంతాల్లో బంగారం తక్కువ ధరకు లభిస్తోంది అంటే..

అబిడ్స్‌.. వందల ఏళ్లుగా బంగారు నగల తయారీ, అమ్మకాల​కు ఈ ప్రాంతం ప్రఖ్యాతి గాంచింది.

నిజాం ప్రభువుల కాలం నుంచి అబిడ్స్‌ ప్రాంతంలో బంగారు ఆభరణాల కొనుగోళ్లు జోరుగా సాగేవి.

అలాగే బషీర్‌బాగ్‌ ప్రాంతం కూడా బంగారు నగలకు చాలా ఫేమస్‌. ఇక్కడ కూడా నాణ్యమైన బంగారం లభిస్తుంది.

ఇవేకాక సికింద్రాబాద్‌లోని జనరల్‌ బజార్‌ సమీపంలోని బంగారు దుకాణాల్లో కూడా నాణ్యమైన బంగారం.. తక్కువ ధరకే లభిస్తుందనే పేరు ఉంది.

మాల్స్‌తో పోల్చితే ఇక్కడ మజూరి, వ్యాట్‌ వంటి విషయాల్లో చాలా తేడా ఉంటుంది.

అయితే బంగారు ఆభరణాలను కొనుగోలు చేసే ముందు చాలా అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మరీ ముఖ్యంగా నాణ్యత విషయంలో ఒకటికి పదిసార్లు ఆలోచించాలి.

సాధారణంగా బంగారు ఆభరణాలకు వాడేది 22 క్యారెట్‌ గోల్డ్‌.

కానీ కొందరు వ్యాపారులు మాత్రం.. 24 క్యారెట్‌ బంగారం ధర ఎంత ఉందో అంత వసూలు చేస్తారు.

మరి కొందరు 18 క్యారెట్‌ బంగారంతో ఆభరణాలు తయారు చేసి.. 22 క్యారెట్‌ బంగారం అని కస్టమర్లకు అంటగడుతుంటారు.

కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

అలానే మజూరీ విషయంలో కూడా.. రెండు మూడు షాపులతో పోల్చుకుని.. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుగోలు చేయాలి.

వాస్తవంగా చెప్పాలంటే బంగారు ఆభరణాలకు సంబంధించి తరుగు అనేది చట్టబద్ధమైనది కాదు.

కానీ బంగారు ఆభరణాల తయారీదారులు మాత్రం తరుగు పేరిటి ఎక్స్‌ట్రా ఛార్జీలు వసూలు చేస్తారు.

అలానే బీఐఎస్‌ హాల్‌మార్క్‌ ఉన్న ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయాలి.