గత కొన్ని రోజులుగా హెచ్3ఎన్2 ఇన్ఫ్లూయెంజా కేసులు పెరిగిపోతున్నాయి.
ఈ వైరస్ సోకిన వారికి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
గొంతు నొప్పి ఉంటే గుటక వేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.
ఏమైనా తిందామంటే గొంతు నొప్పి వస్తుంది. తినకపోతే వ్యాధి తగ్గదు.
అయితే ఇంట్లో దొరికే వస్తువులతో గొంతు నొప్పికి చెక్ పెట్టవచ్చు.
తేనె: ఒక చెంచా అల్లం రసంలో ఒక చెంచాడు తేనె బాగా కలిపి తీసుకుంటే గొంతు నొప్పి తగ్గుతుంది. శ్వాసనాళాల్లో పేరుకున్న కఫాన్ని తేనె కరిగిస్తుంది.
తేనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి గొంతు నొప్పి, చికాకుని తగ్గిస్తుంది.
ఉప్పు నీరు: ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అర చెంచాడు ఉప్పు వేసి ఆ నీటిని నోట్లో వేసుకుని పుక్కిలించి ఊయాలి.
ఇలా చేస్తే కఫం కరుగుతుంది. గొంతులో బ్యాక్టీరియా తొలగిపోతుంది. దీని వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది.
బేకింగ్ సోడా: ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, రెండు చెంచాల ఉప్పు వేసి పుక్కిలించాలి. ఇలా చేస్తే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
చామంతి వేడి నీటిలో చామంతి ఆకులు వేసి.. ఆవిరి పీలిస్తే గొంతు నొప్పి, జలుబు తగ్గుతాయి. రోజూ రెండు కప్పుల చామంతి టీ తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ ఒక కప్పు వేడి నీటిలో ఒకటి లేదా 2 టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేసి గంటకొకసారి పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుంది.
గొంతులో ఉన్న శ్లేష్మాన్ని బయటకు పంపి గొంతుకి ఉపశమనాన్ని ఇస్తుంది.
వెల్లుల్లిపాయ వెల్లుల్లి రెబ్బ ఒకటి బుగ్గన పెట్టుకుని రసాన్ని మింగుతూ ఉంటే గొంతు నొప్పి తగ్గుతుంది.
మిరియాలు ఒక కప్పు నీటిలో అర చెంచాడు మిరియాల పొడి, బెల్లం వేసి మరిగించి తాగితే గొంతులో ఉన్న కఫం ఇట్టే కరుగుతుంది. మీ గొంతు నొప్పి తగ్గుతుంది.
గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా సేకరించబడింది. దీని మీద అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.