‘అమ్మ, నాన్న ఎక్కువ రోజులు బతకలేను, మీరు ధైర్యంగా ఉండండి’ ఇవి చనిపోతున్న కొన్ని రోజుల ముందు ఓ యువకుడు చెప్పిన మాటలు.

అతని పేరు హర్షవర్ధన్. చావు వెతుక్కుంటూ వచ్చినా తన గురించి ఆలోచించకుండా తన వాళ్ళ గురించి ఆలోచించాడు.

ఖమ్మంలోని శ్రీనివాస్ నగర్ కు చెందిన ఏపూరి రామారావు, ప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు హర్షవర్ధన్ (33), చిన్న కొడుకు పేరు అఖిల్.

బీఫార్మసీ అయ్యాక 2013లో ఆస్ట్రేలియా వెళ్ళాడు హర్షవర్ధన్. అక్కడ బ్రిస్బేన్ లో ఓ యూనివర్సిటీలో హెల్త్ మేనేజ్మెంట్, జనరల్ మెడిసన్ లో పీజీ పూర్తి చేశాడు.

ఆ తర్వాత క్వీన్స్ ల్యాండ్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో డాక్టర్ గా చేరాడు. జీవితంలో స్థిరపడ్డాడు కదా అని 2020 ఫిబ్రవరి 20న ఖమ్మం వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

అయితే వీసా వచ్చిన తర్వాత భార్యను తీసుకెళదామని తను ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు.

ఐతే 2020 అక్టోబర్ లో వ్యాయామం చేస్తున్న సమయంలో హర్షవర్ధన్ కి దగ్గు, ఆయాసం రావడంతో హాస్పిటల్ కి వెళ్ళాడు. టెస్టులు చేయించుకోగా లంగ్స్ క్యాన్సర్ అని తేలింది.

తొలుత క్యాన్సర్ కు చికిత్స చేయించుకోగా.. నయమైందని వైద్యులు నిర్ధారించారు.  

కానీ మళ్ళీ క్యాన్సర్ వచ్చింది. దీంతో ఎక్కువ రోజులు బతకడని వైద్యులు వెల్లడించారు.

తాను చనిపోవడం ఖాయమని ఫిక్స్ అయిన హర్షవర్ధన్ తన ఫ్యామిలీ మెంబర్స్ కి కావాల్సిన ఏర్పాట్లు చేశాడు.

తన భార్యకు విడాకులు ఇచ్చి.. ఆమె జీవితానికి ఎలాంటి లోటు లేకుండా ఆర్థికంగా ఆమెను నిలదొక్కుకునేలా చేశాడు. జీవితంలో స్థిరపడేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసి వెళ్ళాడు.

చనిపోయే చివరి క్షణాల్లో బంధువులకు, అమ్మ, నాన్నలకు కాల్ చేసి వీడియో కాల్ లో మాట్లాడాడు.

చనిపోయాక మృతదేహాన్ని ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా తన తల్లిదండ్రులకు చేరేలా ముందుగానే ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతులు తీసుకుని అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు.

లాయర్ ని పెట్టుకుని రూ. 15 లక్షలు ఖర్చుపెట్టి మరీ అనుమతులు తెచ్చుకున్నాడు. మార్చి 24న క్యాన్సర్ మహమ్మారి అతన్ని ఈ లోకం నుంచి తీసుకెళ్ళిపోయింది.

బుధవారం నాడు అతని మృతదేహం ఆస్ట్రేలియా నుంచి భారత్ కు రాగా.. ఖమ్మంలోని ఆయన నివాసంలో అంత్యక్రియలు నిర్వహించారు.

చనిపోయే ముందు కూడా తన జీవితం కంటే కూడా తనను నమ్ముకుని బతికే వారి జీవితాలను నిలబెట్టడం కోసం తాపత్రయపడ్డాడు. 

హ్యాట్సాఫ్ హర్షవర్ధన్. సద్గతులు ప్రాప్తించాలని భగవంతుడ్ని కోరుకుంటూ ఓం శాంతి.