దేశంలో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ మొదలయ్యాక.. అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ తో ఆధార్ నెంబర్ ను లింక్ చేయండంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న సంగతి అందరికీ విదితమే.

ఇప్పటికే రేషన్ కార్డు, పాన్ కార్డు, పెన్షన్ కార్డు సహా ఇతర ముఖ్యమైన పత్రాలతో అనుసంధానం ప్రక్రియ మొదలైపోగా, ఇప్పుడు ఓటర్ వివరాల వంతొచ్చింది.

దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఓటరు వారి వారి ఓటర్ ఐడీ వివరాలను ఆధార్‌‌తో అనుసంధానం చేయాలని కేంద్రం కోరుతోంది. ఈ క్రమంలోనే ఈ వివరాలు తెలియజేస్తున్నాం..

ఆధార్‌‌తో ఓటరు ఐడీ లింక్ చేయు విధానం

ఎన్‌వీఎస్‌పీ పోర్టల్‌ ద్వారా: ముందుగా జాతీయ ఓటరు అధికారిక సేవా పోర్టల్ 'NVSP.in'కి లాగిన్ అవ్వాలి. ఆ తరువాత 'Forms' అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

మీరు ఇప్పటికే ఖాతా కలిగివున్నట్లయితే.. యూజర్ ఐడీ, పాస్వర్డ్ సాయంతో లాగిన్ అవ్వాలి.. లేనియెడల రిజిస్ట్రేషన్ చేసుకోండి.

సైన్ ఇన్ చేసిన తర్వాత, సెర్చ్ ఇన్ ఎలక్ట్రోరల్ రోల్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.

అనంతరం మీ ఓటర్ ఐడీని సెర్చ్ చేయడానికి మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయాలి

ఆధార్ సమాచారాన్ని పూరించాలి

ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి. దీంతో మీ ఓటర్ కార్డుతో మీ ఆధార్ నంబర్ అనుసంధానం పూర్తవుతుంది.

ఫోన్‌ చేయడం ద్వారా: ఫోన్ చేయడం ద్వారా కూడా ఆధార్- ఓటర్ ఐడీ అనుసంధానం చేయవచ్చు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలలో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేసింది. 

అనుసంధానం చేయాలనుకున్న వారు 1950 నంబర్‌కు కాల్ చేసి ఆధార్ నంబర్‌తో పాటు తమ ఓటర్ ఐడీ వివరాలను వివరించాలి. ఈ ప్రక్రియ పూర్తి అయ్యాక.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది.

ఎస్ఎంఎస్ ద్వారా: ఆధార్‌‌తో ఓటరు ఐడీ అనుసంధానాన్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా కూడా పూర్తి చేయవచ్చు. ఇది సులభమైన విధానం. ఇందుకోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మెసేజ్ పంపాల్సి ఉంటుంది. 

ECILINKSPACE>EPIC No.> SPACE>Aadhaar No. ఎంటర్ చేసి 166 లేదా 51969 నెంబర్‌కు మెసేజ్ పంపాలి. అనంతరం లింక్ అయినట్లుగా మెసేజ్ వస్తే.. మీ పని పూర్తయినట్లే.