తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.

నడక మార్గంలో తిరుమలకు వెళ్లేవారికి ఇకపై వేంకటేశ్వరుడి దర్శనం మరింత సులువు కానుంది. 

అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో వచ్చే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లను జారీ చేయనుంది టీటీడీ. 

ఏప్రిల్ 1వ తేదీ నుంచి దివ్యదర్శన టోకెన్లను జారీ చేయనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. 

అలిపిరి నడక దారిలో రోజుకు 10 వేల టోకెన్లను జారీ చేస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. 

శ్రీవారి మెట్టు నడక మార్గంలో రోజుకు 5 వేల టోకెన్లను జారీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. 

వేసవిలో బ్రేక్ సిఫారసు లేఖలను తగ్గిస్తామని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

ఫేస్ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ వినియోగంతో వసతి సౌకర్యం కేటాయింపుల్లో మరింత పారదర్శకత తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. 

వేసవిలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని సుబ్బారెడ్డి వివరించారు.

కాగా, కరోనాకు ముందు నడిచి వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లను టీటీడీ జారీ చేసిన విషయం విదితమే. 

అయితే కొవిడ్ సమయంలో దివ్యదర్శనం టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేసింది.

మళ్లీ ఇన్నాళ్ల తర్వాత నడిచి వెళ్లే భక్తుల కోసం దివ్యదర్శన టోకెన్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది టీటీడీ.

నడక మార్గంలో వచ్చే భక్తుల కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.