బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు.. ఫంక్షన్ అయినా, శుభకార్యం అయినా బంగారం కొనాల్సిందే.
అయితే బంగారం కొనే సమయంలో వినియోగదారులు కొన్ని తప్పులు చేస్తుంటారు.
ముఖ్యంగా బంగారం క్వాలిటీ విషయంలో కొనుగోలుదారులు మోసపోతూ ఉంటారు.
వాటిని అరికట్టేందుకు గతంలోనే బీఐఎస్ హాల్ మార్క్ ని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
కానీ, కరోనా కారణంగా ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు కేంద్రం మరోసారి ఆ అంశంపై స్పందించింది.
హాల్ మార్క్ లేని ఆభరణాల విక్రయాలను నిషేదిస్తామని ప్రకటించింది.
ఆరు అంకెల కోడ్ లేకుండా హాల్ మార్క్ చేసిన ఆభరణాల సేల్స్ ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
ఏప్రిల్ 1, 2023 నుంచి అలాంటి ఆభరణాల అమ్మకాలకు అనుమతి లేదని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అల్ఫాన్యూమరిక్ అంటే అంకెలు పదాలు కలిసిన 6 అక్షరాలు ఉంటాయనమాట.
అవి లేకుండా హాల్ మార్క్ లోగో ఉన్నా కూడా ఆ ఆభరణాలు అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేశారు.
ఏప్రిల్ 1 నుంచి HUIDతో ఉన్న బంగారు ఆభరణాలకు మాత్రమే అమ్మకాలకు అనుమతి ఉంటుందని తెలిపారు.
బంగారు ఆభరణాలపై బీఐఎస్ లోగో, 6 అంకెల అల్ఫా న్యూమరిక్ కోడ్ ఉంటేనే వాటిని కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
2021లోనే కేంద్రం ఆభరణాలపై హాల్ మార్కింగ్ ని తప్పనిసరి చేసింది. ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు కరోనా సమయంలో కాస్త ఆటంకాలు ఏర్పడ్డాయి.
ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి కచ్చితంగా హాల్ మార్కింగ్ తో పాటుగా హెచ్ యూఐడీ ఉండాలని స్పష్టం చేశారు.
అలా లేని పక్షంలో ఆ బంగారు ఆభరణాలపై నిషేధం ఉంటుందని ప్రకటించారు.