ఇంట్లో పూజలు, వ్రతాలు, ఇతరాత్ర ఎలాంటి శుభకార్యాలు, పండుగల వేళ కొబ్బరి కాయ కొడతాం.

అలానే గుళ్లకు వెళ్లినప్పుడు.. ప్రయాణాల సమయంలో కూడా కొబ్బరి కాయ కొడతారు.

అయితే కొబ్బరి కాయ కుళ్లితే అశుభం.. అపశకునం అని భావిస్తారు చాలా మంది.

కొబ్బరి కాయ కుళ్లితే బయట పడేస్తాం. కానీ కొందరు దానితో కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయగోదావరి జిల్లాలు అంటే కొబ్బరి తోటలకు పెట్టింది పేరు.

కొబ్బరి కాయలు, నూనె, తెలగపిండి, కొబ్బరి చిప్పలు, కొబ్బరి పీచు, పీచులోంచి వచ్చే పౌడర్‌, తాడు, ఆకుల నుంచి ఈనెలు, కమ్మలు..

 ఇలా కొబ్బరి చెట్టులో ఉపయోగం లేని భాగం అంటూ ఏది లేదు.

కానీ జిల్లా వాసులు.. ఆఖరికి కుళ్లిన కొబ్బరితో కూడా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు.

సాధారణంగా.. నూటికి 5 కొబ్బరి కాయలు కుళ్లిపోయినవి వస్తుంటాయి. కొందరు వీటిని ప్రత్యేకంగా కొంటారు.

కొబ్బరి తోటల వారి దగ్గర కాయ రూపాయి, 2 రూపాయలకు కొని.. ఉత్తరాధి వారికి కాయ 8-10 రూపాయలకు అమ్ముతారు.

కుళ్లిన కొబ్బరి కాయ గుజ్జును తీసి.. ఎండబెట్టి.. దాని నుంచి కొబ్బరి నూనె తయారు చేస్తారు. 

దీన్ని సబ్బుల తయారీలో వినియోగిస్తుంటారు. ఈ నూనె కేజీ 30-40 రూపాయలు ఉంటుంది.

కొబ్బరి చిప్పలను పొడి చేసి దోమల నివారణకు వాడే కాయిల్స్‌లో వినియోగిస్తారు. ఇవి టన్ను 5 వేల వరకు పలుకుతాయి.

ఇక కుళ్లిన కొబ్బరి కాయలను ఎండబెట్టి.. వాటిని ఉత్తరాదికి ఎగుమతి చేస్తారు. అక్కడ వీటిని శవాల దహనానికి వినియోగిస్తారు.

 కాశీ వంటి పుణ్య స్థలాల్లో మరణించిన వారికి కొబ్బరి కాయలతో అంత్యక్రియలు చేస్తే.. పుణ్యం వస్తుందని నమ్ముతారు. దీని కోసం ఎక్కువగా కుళ్లిన కాయలనే వాడతారు.

ఇలా కుళ్లిన కొబ్బరి కాయాలు, చిప్పలు, నూనే వంటి వాటి మీద ఉభయగోదావరి జిల్లాల నుంచి ఏటా 100 కోట్ల రూపాయల వరకు బిజినెస్‌ జరుగుతోంది